మనకు తెలియని 5 విచిత్రమైన ఫోబియాలు
మనిషి జీవితంలో భయం అనేది సహజమైన భావన. అది మనల్ని రక్షించడానికే పనిచేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో భయం తార్కికత(Logic)ను కోల్పోయి తీవ్రమైన మానసిక ఆందోళనగా మారుతుంది. అలాంటి పరిస్థితినే మనోవిజ్ఞానంలో ఫోబియా అంటారు. అంటే.. తార్కికత లేని భయం అని అర్థం. సాధారణంగా మనకు తెలిసిన ఫోబియాలు.. ఎత్తుల భయం, చీకటి (Dark) భయం, జంతువుల (Animals) భయం, నీళ్ల (Water) భయం. ఇటీవలి కాలంలో సామాజిక సంబంధాలు, ఒత్తిళ్లు, ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని కొత్త ఫోబియాలు తెర మీదికి వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. పెంతెరా ఫోబియా, అనుప్తా ఫోబియా, ఎర్గో ఫోబియా, ఎఫిబి ఫోబియా, క్రోమెటో ఫోబియా. వీటిని అర్థంచేసుకోవడం ద్వారా మనిషి భావోద్వేగాల, సంబంధాల, మానసిక ఆరోగ్య స్థితిని లోతుగా తెలుసుకోవచ్చు.

- పెంతెరా ఫోబియా (Panthera Phobia).. అత్తపై భయం
ఇది.. అత్తపై తార్కికతలేని భయం. తీవ్రమైన ఆందోళన. చాలా సందర్భాల్లో కుటుంబ వివాదాలు, నియంత్రణ, విమర్శలు లేదా పాత ప్రతికూల అనుభవాల ఫలితంగా వస్తుంది. అత్తా కోడలు లేదా అల్లుడూ అత్త సంబంధాలు కొన్ని సాంస్కృతిక పరిస్థితుల్లో సంక్లిష్టంగా మారతాయి. ఒకరు ఆధిపత్యం చూపడం లేదా విమర్శించడం వల్ల వ్యక్తి మనసులో భయం పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు అత్తను చూసినా, ఆమె గురించి ఆలోచించినా ఒత్తిడి, చెమటలు, గుండె వేగం పెరగడం వంటి శారీరక లక్షణాలు చూపుతారు. ఈ భయానికి చికిత్సగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఉపయోగిస్తారు. ఇది వ్యక్తిని ఆలోచనా మార్పు ద్వారా భయాన్ని క్రమంగా అధిగమించడానికి సహాయపడుతుంది. కుటుంబ కమ్యూనికేషన్ మెరుగుపరచడం కూడా చాలా ప్రయోజనకరం.
- అనుప్తా ఫోబియా(Anupta Phobia).. ఒంటరిగా ఉండే భయం
ఇది.. వివాహంకాని స్థితిలో ఉండిపోవాలనే భయం. సాధారణంగా సమాజ ఒత్తిడి, కుటుంబ అంచనాలు లేదా వ్యక్తిగత అస్థిరత వల్ల కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులు ఒంటరితనం భయంతో ఆరోగ్యకరమైన సంబంధాల కన్నా కూడా ఏదో ఒక సంబంధంలో ఉండాలని ప్రయత్నిస్తారు. ఇది తరచుగా తక్కువ ఆత్మవిశ్వాసం, ప్రేమ దాహం, తిరస్కరణ భయం నుంచి ఉత్పన్నమవుతుంది. దీని నివారణకు స్వీయ అవగాహన, ఆత్మగౌరవం పెంపు, మానసిక కౌన్సెలింగ్ అవసరం. వ్యక్తి తన విలువను సంబంధాల ద్వారా కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వం ద్వారా తెలుసుకోవడం ముఖ్యమైంది.
- ఎర్గో ఫోబియా(Ergo Phobia).. పనిపై భయం
ఇది.. పనిచేయడంపై లేదా ఉద్యోగంపై తీవ్రమైన భయం. అలసత్వం కాదు. ఆందోళన రుగ్మత లేదా గత ఉద్యోగ అనుభవాల్లో ఎదురైన మానసిక దెబ్బల ఫలితం. ఇలాంటి వ్యక్తులు ఉద్యోగాన్ని తీవ్ర ఒత్తిడి, విఫలం, విమర్శ వంటి భావాలతో అనుసంధానిస్తారు. పని చేయాల్సిన రోజుల్లో ఆందోళన, నిద్రలేమి లేదా పనికి దూరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ భయాన్ని తగ్గించడానికి ఎక్స్‌పోజర్ థెరపీ, శ్వాసాభ్యాసం, కౌన్సెలింగ్ ఉపయోగిస్తారు. వ్యక్తి భయానికి మూల కారణం(ఉదా: అధికారి భయం, విఫలమవ్వడం లేదా విమర్శ భయం) గుర్తించి పరిష్కరించడం ద్వారా ధైర్యాన్ని పునరుద్ధరించొచ్చు.
- ఎఫిబి ఫోబియా(Ephibi Phobia).. యువతపై భయం
ఇది.. యువత లేదా కిశోరుల పట్ల ఉన్న భయం లేదా విరక్తి. సాధారణంగా మాధ్యమాల్లో ప్రతికూల చిత్రీకరణ, తరం మధ్య ఉన్న అపార్థాలు లేదా వ్యక్తిగత అనుభవాల వల్ల ఏర్పడుతుంది. కొంత మంది పెద్దలు యువతను తిరుగుబాటుగానే చూస్తారు. ఈ భావన వల్ల వారితో మాట్లాడటం, బోధించడం లేదా కలవడం భయానకంగా అనిపిస్తుంది. ఈ ఫోబియా సమాజంలో తరం మధ్య గోడలను సృష్టిస్తుంది. దీన్ని అధిగమించడానికి అవగాహన, సానుభూతి, సానుకూల సంభాషణ అవసరం. యువత ప్రవర్తన ఎదుగుదలలో భాగమని అర్థంచేసుకున్నప్పుడు పెద్దల్లోని ఈ భయం తగ్గుతుంది. యువత, మూఢ వయస్కుల మధ్య సహకార కార్యక్రమాలు ఈ విరోధ భావనను తగ్గిస్తాయి.
- క్రోమెటో ఫోబియా(Chrometo Phobia).. డబ్బుపై భయం
దీన్నే క్రిమాటో ఫోబియా అని కూడా అంటారు. డబ్బు లేదా ఆర్థిక వ్యవహారాలపై భయం. ఇది విచిత్రంగా అనిపించినా చాలా సందర్భాల్లో ఆర్థిక నష్టం, గత అనుభవాల గాయం, నైతిక ఆందోళనలు దీనికి కారణమవుతాయి. కొంత మంది డబ్బును పాపం, లోభం లేదా అవినీతిగా చూస్తారు. కొంత మంది ఆర్థిక బాధ్యతల ఒత్తిడితో దాన్ని దూరంగా ఉంచుతారు. దీని ఫలితంగా వాళ్లు బిల్లులు చెల్లించడం, బ్యాంక్ లావాదేవీలు చేయడం వంటి విషయాల నుంచి దూరంగా ఉంటారు. ఈ భయాన్ని తగ్గించడానికి ఆర్థిక అవగాహన, ధైర్యవంతమైన కౌన్సెలింగ్, ధనంపై సానుకూల దృక్పథం అవసరం.
వినడానికి వినోదంగా ఉన్నా
పెంతెరా ఫోబియా, అనుప్తా ఫోబియా, ఎర్గో ఫోబియా, ఎఫిబి ఫోబియా, క్రోమెటో ఫోబియా.. ఈ 5 ఫోబియాలు మనిషి మానసిక జీవితంలోని లోతైన భయాలను ప్రతిబింబిస్తాయి. ఇవి వినడానికి వినోదంగా ఉన్నా వాస్తవానికి భావోద్వేగ అసమతౌల్యం, సామాజిక ఒత్తిడి, స్వీయ భావన లోపం వల్ల ఏర్పడతాయి. ఫోబియాలు మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తాయి. భయం ఒక బలహీనత కాదు. అది మనసులోని అసంతృప్తి, పరిష్కారం కావాల్సిన సమస్యలకు సంకేతం. సరైన అవగాహన, మానసిక చికిత్స, సానుకూల దృక్పథంతో ఈ భయాలను అధిగమించొచ్చు. అప్పుడే మనిషి జీవితం మరింత ధైర్యంగా, సమతుల్యంగా, ఆనందంగా మారుతుంది.
- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | క్లినికల్ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ | స్పెషల్ ఎడ్యుకేటర్ | ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321


