- కొన్ని పరిహారాలతో తప్పించుకోవచ్చు..
- శని జయంతిని చేసుకోవడం అత్యుత్తమం..
‘ఏలినాటి శని’ ఈ పేరు వింటేనే చాలు భయపడి పోవడం సహజం. కానీ ఏలినాటి శని గురించి సమగ్రంగా తెలుసుకుంటే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పుట్టిన ప్రతి వ్యక్తికీ జీవితంలో ప్రతి 30 ఏళ్లకు ఒకసారి తప్పకుండా వచ్చే దశ ఏలినాటి శనిదశ. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు.
అయితే కొన్ని పరిహారాలు పాటించడం వలన ఏలినాటి శని జరిగే సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శనివారం చేయాల్సిన ఈ పరిహారాలు ఈ ఏడాది శనివారంతో పాటు శని జయంతి కలిసి వచ్చిన విశిష్టమైన రోజు చేయడం ఫలితాలు అధికంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ఏలినాటి శని అంటే వ్యక్తిగత జాతకంలో చంద్ర రాశికి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే 7.5 సంవత్సరాల కాలం. ఈ సమయంలో వృత్తి పరంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగా, ఆర్థికంగా కష్టనష్టాలు ఉంటాయి. అయితే ఏలినాటి శని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
నిజానికి శని ఆయుఃకారకుడు. అయితే శని మందగమనుడు కాబట్టి తలపెట్టిన పనులు ఆలస్యం అవుతాయేమో కానీ అసలు కాకుండా ఉండవు. నిజానికి పరిశీలించి చూస్తే ఒక వ్యక్తి జీవితంలో వివాహం, ఇల్లు కట్టుకోవడం వంటి శుభ కార్యాలన్నీ శని భగవానుని అనుగ్రహంతోనే నెరవేరుతాయి.
