Friday, May 22, 2026
HomeజాతీయంECI | సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీఐ..

ECI | సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీఐ..

  • తమిళనాడు సీఎస్ ను తొలగిస్తూ నిర్ణయం..
  • కొత్తగా సాయికుమార్ నియామకం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందంను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. సాయికుమార్‌ను కొత్త సీఎస్‌గా నియమించింది. ఈ మార్పులను వెంటనే అమలు చేసి, బుధవారం సాయంత్రం 6 గంటలలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాత వైఖరి, పారదర్శకత కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ మార్పులతో పాటు పరిపాలనలో మరో కీలక మార్పు కూడా చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) చీఫ్‌గా ఉన్న డేవిడ్సన్ దేవశిర్వతంను బదిలీ చేసి, ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ మిట్టల్‌ను నియమించింది. మిట్టల్, డీవీఏసీతో పాటు ఆర్మ్‌డ్ పోలీస్ విభాగం అధిపతిగా కూడా వ్యవహరిస్తారు.

- Advertisement -

బదిలీ అయిన అధికారులకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులు కేటాయించవద్దని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో అధికార యంత్రాంగం దుర్వినియోగం కాకుండా, ప్రజలకు స్వేచ్ఛాయుత ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే ఈసీ ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News