- దరఖాస్తుదారులకు సౌకర్యాలు కల్పించాలి
- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట జిల్లాలో జరగనున్న 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 తొలి విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని జగదేవ్‌పూర్, గొల్లపల్లి క్లస్టర్ కేంద్రాలను సందర్శించారు. జగదేవ్‌పూర్ క్లస్టర్ పరిధిలో పిర్లపల్లి, ధర్మారం గ్రామాల నామినేషన్లు; గొల్లపల్లి క్లస్టర్ పరిధిలో కొండాపూర్, దౌలాపూర్ గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో తొలి విడతలో దౌల్తాబాద్, రాయపోల్, మార్కుక్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్ మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు 44 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్లు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతించాలని, క్లస్టర్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.ఎంపీడీఓలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి అన్ని సౌకర్యాలు పర్యవేక్షించాలని, పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

