- సోమవారం లిఫ్ట్ నీటిని విడుదల చేస్తామని రైతులకు ఇరిగేషన్ అధికారుల భరోసా
శివగంగ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు (Farmers Protest) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ సమస్య కారణంగా లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణకు ఆటంకం ఏర్పడటంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు శనివారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన బాట పట్టారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ట్రాఫిక్ స్తంభన
రైతుల నిరసనతో (Farmers Protest) మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు,వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను వెంటనే పరిష్కరించి లిఫ్ట్ ఇరిగేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇరిగేషన్ అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమణ
విషయం తెలుసుకున్న చింతలపాలెం ఎస్‌ఐ పరమేష్ ఇరిగేషన్ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. మరుసటి రోజే ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి వస్తుందని సోమవారం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ నడుస్తుందని భరోసా కల్పించారు. అంతేకాకుండా సోమవారం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇప్పిస్తానని తెలిపారు. అధికారుల హామీతో రైతులు తమ ఆందోళనను విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇచ్చిన హామీ మేరకు ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను పరిష్కరించి లిఫ్ట్ ఇరిగేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు భారీగా పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
