Homeహైదరాబాద్‌Mettu Sai Kumar | బీఆర్ఎస్‌ పదేళ్ల పాలన.. ‘దగా’ల చిట్టా!

Mettu Sai Kumar | బీఆర్ఎస్‌ పదేళ్ల పాలన.. ‘దగా’ల చిట్టా!

  • గాంధీ భవన్‌లో ‘అబద్ధాలు – వాస్తవాలు’ ఫొటో ఎగ్జిబిషన్‌..
  • మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రచారం..

బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయి? కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది? అనే అంశాలను ప్రజల ముందు ఉంచుతూ గాంధీ భవన్‌లో ‘అబద్ధాలు–వాస్తవాలు’ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. తెలంగాణ మత్స్య సహకార సంస్థ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.

‘దశాబ్దపు దగా’ వర్సెస్‌ ‘ప్రజా పాలన’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని బీఆర్ఎస్‌ పాలనలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ఒకవైపు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మరోవైపు ప్రదర్శించారు. ఫొటోలు, పోస్టర్ల ద్వారా రెండు ప్రభుత్వాల పాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మెట్టు సాయికుమార్‌ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

డబుల్‌ బెడ్రూం ఇళ్లకు బదులు ఇందిరమ్మ ఇళ్లు

పేదల సొంతింటి కలను నెరవేర్చే విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శనలో ఎత్తిచూపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ముందుకు సాగుతోందని సాయికుమార్‌ తెలిపారు.

కేజీ టు పీజీ హామీ.. యంగ్‌ ఇండియా స్కూళ్లు

ఉచిత కేజీ టు పీజీ విద్య హామీ అమలు కాలేదని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక సదుపాయాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. నాణ్యమైన విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందించడమే లక్ష్యమన్నారు.

సంక్షేమమే ‘ప్రజా పాలన’కు కొలమానం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని సాయికుమార్‌ పేర్కొన్నారు. గత పాలనలోని హామీలు, ప్రస్తుత ప్రభుత్వ పథకాల మధ్య తేడాను ప్రజలకు వివరించేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తామని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News