వేటూరి జయంతి(Veturi sundararamamurthi Jayanthi) తెలుగు పదానికి పునరావృత జన్మదినం. ఆయన గేయ రచనా వైవిధ్యం ఎందరికో స్ఫూర్తిదాయకం. శ్రీశ్రీ తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు పాటల రచయత(Telugu song writer) వేటూరి సుందరరామమూర్తి. మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు ఈ అవార్డు అందుకున్నారు. ఇటు క్లాసే కాదు. అటు మాస్ సాంగ్స్ రాయడంలోనూ వేటూరివారిది అందె వేసిన చెయ్యే. 9 వేలకు పైగా పాటలను అలవోకగా ధారాపాతంగా రాసిన గొప్పతనం వేటూరిది. పల్లెటూరి మాటలైనా, సమాస భూయిష్ట సంక్లిష్ట పదాలైనా పండితుడి నుండి పామరుడి వరకూ అవలీలగా చేరి సులభంగా ప్రతీ నోటా పాడుకునేలా చేసిన అసమాన ప్రతిభ ఆయనకే సొంతం.
వేటూరి.. సినిమా పాటలు రాయడానికి ముందు కొంతకాలం పత్రికల్లో పనిచేశారు. తెలుగు భాష, సాహిత్యాలపై మక్కువ పెంచుకోవడానికి కారణం ఇద్దరు. ఒకరు.. ఆయన పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి. తెలుగులో ప్రథమ జ్ఞానపీఠ గ్రహీత. ఇంకొకరు.. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. 1960ల్లో మొదట ఆంధ్ర పత్రికలో, తర్వాత ఆంధ్ర పత్రిక వీక్లీలో సహాయ సంపాదకుడుగా, ఆపై కొంతకాలం ఆంధ్రప్రభ వార పత్రికకు చీఫ్ సబ్ ఎడిటర్‌గా పని చేశారు. ఎన్టీఆర్ నటించిన దీక్ష సినిమాలో తొలిసారిగా సినిమాకు గీత రచన ప్రారంభించినా అది సినిమాలో రాలేదు. 1972లో ఓ సీత కథ సినిమాలో లీల పాడిన హరికథతో సినిమా దర్శకులు కె.విశ్వనాథ్ ప్రోత్సాహంతో సినిమా పాటల రచయితగా శ్రీకారం చుట్టారు.
తర్వాత.. వెనుతిరిగి చూడకుండా సాగుతూ వరుసగా సినిమా పాటలు రాస్తూ వచ్చారు. సంక్షిప్తంగా ‘వేటూరి’లా పేర్కొనే వేటూరి సుందరరామమూర్తి రచయితగా సినీ పరిశ్రమకు పరిచయం కావడం తెలుగు ప్రజల పురాకృత సుకృతం. ఆయన 1936 జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో జన్మించారు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్, బెజవాడలో డిగ్రీ పూర్తి చేశారు. 1956 నుంచి 16 ఏళ్లపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ముందుగా దైతా గోపాలం, ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతోపాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరే.
కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి మాతృభాషాభిమానాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. వేటూరి మొదటి పాట ఓ సీత కథ. చివరి పాట బద్రీనాథ్‌లోని ఓంకారేశ్వరి. ఆ మధ్యకాలంలో ఆయన వేల పాటలు రాశారు. ఓంకారేశ్వరి పాటలో 108 వైష్ణవ దివ్య స్థలాలను వ్యక్తపరిచిన తీరు అసమానం, అపూర్వం, మహాద్భుతం. సంప్రదాయ కవిత్వ పద బంధాల నుంచి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. కవనంలో, భావంలో, భాషలో పండితుల నుంచి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం.
వేటూరి సినీ పాటల పరంపర నాలుగు దశాబ్దాలకు పైగా నిరాటంకంగా కొనసాగింది. దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు, సినీ సంబంధీకులకు ఆలంబనగా నిలిచింది. శ్రోతల హృదయాలను దోచింది. పసలేని చిత్రాలను పాటల ద్వారా తీరాలకు చేర్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినీ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంది. వేటూరి పాటల పూదోటలో పూసిన అన్ని పాటలూ పరిమళం కోల్పోని సుగంధ పుష్పాలే. ఎన్నటికీ వాడిపోని అందమైన లతాంతాలే. గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాటల్లో చెప్పాలంటే.. ఉపనిషత్తుల నుంచి ఉలిపిరి కాయితం వరకూ దేని గురించైనా అపారమైన పరిజ్ఞానం వేటూరి సొంతం.
మహాకవి శ్రీశ్రీ అన్నట్లు.. తాను కన్న, విన్న, అనుభవించిన, ఊహించిన ప్రతి అంశాన్నీ పదబద్ధం చేసి, కాదేదీ కవితకు అనర్హం అని నిరూపించిన నేర్పరి వేటూరి. వేటూరి భువి నుంచి దివికేగినా ఆయన పాటలు అజరామరాలు. నిరంతరం తెలుగువారి నోట నడయాడే సుస్వరాలు. తెలుగు ప్రజల మనోఫలకాలపై చెరగని ముద్రలు వేసి 75 ఏళ్ల వయసులో 2010 మే 22న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
(జనవరి 29న వేటూరి సుందరరామమూర్తి జయంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
