- బడంగ్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల దందా..
- టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు..
- ఇంటి పర్మిషన్‌తో కమర్షియల్ నిర్మాణం..
- బాలాపూర్- ఆర్‌సీఐ రోడ్డుపై నిబంధనల ఉల్లంఘన..
- ఫిర్యాదులు వచ్చినా స్పందించని అధికారులు
- ప్రభుత్వానికి ఫీజుల ఎగవేత ఆరోపణలు..
- అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్..
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందా బడంగ్‌పేట్ సర్కిల్? చట్టాలు, నిబంధనలు కేవలం సామాన్యుడిని పీడించడానికేనా? బడా బాబుల అక్రమాలకు ఇక్కడి అధికారులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా, ఉన్నతాధికారులు ‘కళ్ళున్నా చూడలేని గ్రుడ్డివారిలా’ నటిస్తుండటం వెనుక అసలు రహస్యం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్లాన్ ఒకటైతే.. నిర్మాణం మరొకటి: మోసానికి పరాకాష్ట! బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ – ఆర్.సి.ఐ. ప్రధాన రహదారిపై సాగుతున్న ఓ అక్రమ నిర్మాణ లీలలు టౌన్ ప్లానింగ్ విభాగం బండారాన్ని బట్టబయలు చేస్తోంది. ఇద్దరు నిర్మాణదారులు ప్రభుత్వం నుండి కేవలం రెండు అంతస్తుల (డొమెస్టిక్) నివాస భవనం కోసం వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారు. కానీ, తీరా క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారు.

ప్రభుత్వానికి వేటు: నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మార్ట్‌గేజ్ ఫీజును ఎగ్గొట్టి, ప్రభుత్వ ఖజానాకు నిలువునా గండి కొట్టారు. అనుమతి ఒకటికి.. నిర్మాణం ఇంకొకటికి: నివాస భవనానికి పర్మిషన్ తెచ్చుకుని, ఏకంగా సెల్లార్‌తో కూడిన భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించేశారు. ఇంత జరుగుతున్నా, పక్కనే ఉన్న ప్రధాన రహదారిపై ఈ అక్రమదందా సాగుతున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఏ స్థాయి “చేతులు” మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పరిపాటిగా మారిన సంస్కృతి: ఇక్కడో విచిత్రమైన సంప్రదాయం నడుస్తోంది. అక్రమ నిర్మాణంపై బాధ్యతగల పౌరులు అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అధికారులు ఆ ఫిర్యాదును పరిశీలించే లోపే.. అక్కడ భవన నిర్మాణం చకచకా పూర్తయి పోతుంది! ఫిర్యాదులు రావడం, అధికారులు ఫైళ్లను పక్కన పెట్టడం, ఈలోగా బిల్డర్లు పని కానిచ్చేయడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.

అధికారుల మౌనం దేనికి సంకేతం? ఈ భారీ అక్రమ నిర్మాణంపై బడంగ్‌పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు పదే పదే ఫిర్యాదులు అందినప్పటికీ, వారి నుంచి ఎలాంటి చలనం లేదు. ఈ మౌనం దేనికి సంకేతం? అవినీతి తిమింగలాల అండదం డలతోనే ఈ అక్రమ కట్టడాలు సాగుతు న్నాయా? “అవినీతిని ప్రోత్సహించడంలో మా తర్వాతే ఎవరైనా” అంటూ అధికారులు సవాల్ విసురుతున్నారా? మీడియాలో కథనాలు వచ్చినా, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమైనా ఇక్కడి అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు. ప్రభుత్వ నియమ నిబంధనలను నవ్వులపాలు చేస్తూ, అక్రమ నిర్మాణానికి అధికారులు తామే స్వయంగా ‘శుభం కార్డు’ పలికేలా వ్యవహరిస్తున్నారు.
ఉన్నతాధికారులైనా మేల్కొంటారా..? కింది స్థాయి సిబ్బంది అవినీతి మామూళ్ల మత్తులో జోగుతుంటే.. ఉన్నతాధికారులు సైతం “మేము సైతం” అంటూ లైట్ తీసుకుంటారా? లేక చట్టాన్ని గౌరవించి ఈ అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు నడిపిస్తారా? చట్టం ఇక్కడ తన పని తాను చేస్తుందా.. లేక అవినీతి తిమింగలాలకు దాసోహమంటుందా? బాధ్యత గల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, ఇందుకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
