Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAnde Sri | మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

Ande Sri | మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

ఆయన బ్రతికున్నపుడు రాసిన పాట.. చనిపోయాక ప్రభావం కనిపిస్తోంది..

  • భవిష్యత్తును ఊహించి పాట రాసిన అక్షర శిల్పి అందెశ్రీ
  • అక్షర సత్యాలని నిరూపితం అవుతున్నాయి..
  • మనిషి మాయమైపోయాడని కళ్ళముందే కనిపిస్తోంది..
  • ఒకప్పుడు ఆయన్ను ఆకాశానికెత్తేసిన వాళ్ళే ఇప్పుడు మర్చిపోయారు..
  • ఆయన సమాధి దగ్గర స్మృతి వనం కడతామన్న ప్రభుత్వం..
  • సమాధి మీద మట్టి గాలికి ఎగిరిపోతున్నా పట్టించుకోని దుర్మార్గం..
  • కాఠిన్యమైన పరిస్థితులను చూసి రోదిస్తున్న అందెశ్రీ పవిత్ర ఆత్మ..

అయన మట్టిలోనుంచి పుట్టిన మహోన్నత గేయం.. ఆయన సృష్టించిన ప్రతి అక్షరం కన్నీళ్లు పెట్టిస్తుంది.. హృదయాంతరాలను తట్టిలేపుతుంది.. వేదనలోనుంచి ఆలోచింపజేసే భావాలను వెదజల్లుతుంది.. చదువు లేదు.. కానీ ప్రపంచాన్ని ఆకుళింపుజేసుకున్న విజ్ఞానం ఉంది.. సమాజాన్ని తన కళ్ళతోచూసి నేర్చుకున్న చైతన్యం ఉంది.. ఎదుటివ్యక్తిలో ఆలోచనలు రగిల్చే స్ఫూర్తి నిప్పు కణాలు ఆయన అణువణువునా ప్రవహిస్తూ ఉంటాయి.. ‘‘ తెలంగాణా మాతృ గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. పల్లెనీకు వందనములమ్మో.. జై బోలో తెలంగాణ.. గలగల గజ్జెలబండి.. రండి కదలిరండి.. సినుకమ్మ.. కొమ్మ చెక్కితే బొమ్మరా… యెల్లిపోతున్నావా తల్లి.. చూడ చక్కని తల్లి ‘‘ అంటూ ఎన్నో గీతాలకు ప్రాణప్రతిష్ట చేసిన మహాకవి అందెశ్రీ..

- Advertisement -

అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటూ జాతీయ స్థాయికి ఎదిగిన అందెశ్రీ బతికున్నప్పుడు పడ్డ కష్టాలకంటే, ఆయన మరణానంతరం ఆయన ఆత్మ పడుతున్న క్షోభ అంతా ఇంతా కాదు.. అందెశ్రీ పార్ధివదేహాన్ని ఖననం చేసిన చోట ఒక స్మృతి వనాన్ని కట్టించి, భావితరాలకు ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాం అని బీరాలు పలికిన అధికార ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఊసే ఎత్తడం లేదు.. హోరు గాలిలో సమాధి విూద మట్టి ఎగిరిపోతుంటే.. జోరు వానల్లో మట్టి కరిగిపోతుంటే.. అసాంఘిక కార్యకలాపాలకు ఆ పవిత్ర భూమి నెలవుగా మారి తన పవిత్రతను కోల్పోతుంటే.. అందెశ్రీ ఆత్మ కారుస్తున్న కన్నీటి బొట్లు మౌనంగా రోదిస్తూ జాలువారుతున్నాయి.. నిజంగా మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు..

అందెశ్రీగా గణతికెక్కిన అందే ఎల్లయ్య.. జీవితం ఎంత చెప్పుకున్నా సశేషం గానే మిగిలిపోతుంది.. 1961లో రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ భూవ్మిూద పడగానే కష్టాల కడగండ్లు ఆయనను చుట్టుముట్టాయి.. జీవితం ప్రారంభంలోనే పేదరికంతో సావాసం చేస్తూ పెరిగారు.. చదువు ఆయనతో విడిపోయింది.. కానీ అది ఆయనకు బలహీనత కాకుండా ఆయన అత్యున్నత జీవన శైలికి ఒక అద్భుతమైన శక్తిగా నిలిచిపోయింది.. తల్లి దండ్రులు చిన్న వయసులోనే ఆయనను విడిచిపోయారు.. గడ్డిపల్లపు పనులు, నిర్మాణ కార్మికుడిగా సాగిపోవడం ఆయన జీవితంలో భాగంగా మారిపోయాయి..

చదువు లేకపోయినా, సాధారణ ప్రజల భావాలు, బాధ, ఆశ, ఆశయాలు ఇవన్నీ ఆకుళింపుచేసుకుంటూ రచనలు, గీతాలు రాయడం అలవాటుగా చేసుకున్నారు.. వేలాది కవితలు, పాటలు రాశారు.. వాటి ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నారు.. తెలుగు సినీ వినీలాకాశంలో అత్యున్నత భావ గీత రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు.. మరీ ముఖ్యంగా ఆయన విరచితమైన ‘‘జయ జయహే తెలంగాణ ‘‘ తెలంగాణ రాష్ట్ర గీతంగా అందరి మన్ననలు పొందింది.. ఇక లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు ఆయనకు అలంకారాలుగా మారి పోయాయి.. ఉత్తమ గేయ రచయితగా 2006లో నంది అవార్డు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవడాక్టరేట్‌ పట్టా..

2025 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటి రూపాయల పురస్కారంతో గౌరవించబడ్డారు. ఆయన సాహి త్యం, పాటలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో కూడా చోటు పొందాయి. అందెశ్రీ ఆయన 2025 నవంబర్‌ 10న గాంధీ హాస్పిటల్‌లో హార్ట్‌ అటాక్‌ కారణంగా కన్నుమూశారు.. అప్పటికి ఆయన వయసు 64 సంవత్సరాలు.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసిందని తెలుస్తోంది.. ఎలాంటి అక్షరాభ్యాసం లేకపోయినా ప్రజల మధ్య నుంచి పుట్టి, వారి ఆకాంక్షలు, బాధలను పదాల్లో ముంచిన గొప్ప కవి. ఆయన రచనలు తెలంగాణ రాష్ట్ర నిర్మాణా నికి జీవం ఇచ్చాయి అన్నది అక్షర సత్యం ఇంతవరకు బావుంది..

అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంశం చాలా బాధాకరంగా ఉంటుంది.. అందెశ్రీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ కి అవ్యక్తమైన గౌరవం.. అందెశ్రీ అనే మహాపురుషుడు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం అని ఎన్నో మార్లు కీర్తించారు.. ఆయనను సగౌరవించారు.. ఆయన కుటుంబానికి బాసటగా నిలిచారు.. అందెశ్రీ స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లారు.. ఆయన మరణానంతరం ఆయన పాడెను మోసి తన కృతజ్ఞతను తెలియజేశారు.. ఈ దృశ్యాలను చూసిన యావత్‌ భారతావని హృదయాలు ఆనందంతో పులకరించిపోయాయి.. కానీ అందెశ్రీ మరణానంతరం ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేసిన ఘటకేసర్‌ లోని ఎన్‌.ఎఫ్‌.సి. నగర్‌ ప్రాంతం ఇప్పుడు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంగా కనిపిస్తోంది..

ఎవరూ పట్టించుకోని అనాథలా దర్శనం ఇస్తోంది.. పాతిపెట్టి కప్పెట్టిన మట్టి గాలికి కొట్టుకుని పోతోంది.. జంతువులు సంచరిస్తూ మల మూత్ర విసర్జలు చేస్తున్నాయి.. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.. అప్పట్లో ఈ ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిత్తుతామని చెప్పిన రేవంత్‌ ప్రభుత్వం దీని గురించి ఆలోచించడం లేదా..? ఒకవేళ ఏదైనా ప్లాను చేస్తున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది.. ఆ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసు కూడా ఉంది.. అయితే స్మృతి వనం నిర్మాణం ఎప్పుడైనా చేయవచ్చు, కనీసం ఇప్పుడున్న ప్రదేశానికి ఒక ఫెన్సింగ్‌ వేసి ఎవరూ ప్రవేశించకుండా చూడాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News