రైతు సంఘాలు సబ్సిడీ పై (Agriculture subsidies) వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్ సూచించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఎస్ఎంఏఎం) కింద కస్టమ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ) ఏర్పాటుకు అర్హత కలిగిన సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ నమోదిత రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. కేంద్రాల ఏర్పాటుకు అయ్యే అర్హత కలిగిన ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం సబ్సిడీగా, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు.
అదే విధంగా కిసాన్ డ్రోన్ కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీతో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు.కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా ట్రాక్టర్లు, రోటావేటర్లు, హార్వెస్టర్లు, గడ్డి కట్టే యంత్రాలు, ధాన్యం ఆరబెట్టే డ్రయ్యర్లు, గట్టు వేసే యంత్రాలు తదితర 34 రకాల వ్యవసాయ పరికరాలను రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చని చెప్పారు. సంఘాలు సబ్సిడీపై కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను స్థానిక రైతులకు తక్కువ అద్దెకు అందించడం ద్వారా రైతుల పెట్టుబడి భారం తగ్గడంతో పాటు సంఘాలకు కూడా ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.ఆసక్తి, అర్హత కలిగిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మండల వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని బి.శ్రీనివాస్ కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
