- దేవుడి గుడిలో దొంగతనం..Meerut Shiva Temple Theft
- సీసీ టీవీ ఫుటేజీతో బయటపడ్డ వైనం..
అర్ధరాత్రి వేళ శివాలయంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు (Meerut Shiva Temple Theft) నగదు, పూజా సామగ్రితో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. చివరకు శివలింగంపై ఉండే నాగదేవత విగ్రహాన్ని సైతం వదలకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 16, సోమవారం రాత్రి ఇద్దరు దొంగలు ముఖాలకు ముసుగులు ధరించి మీరట్‌లోని ఓ శివాలయంలోకి ప్రవేశించారు. ముందుగా ఆలయ ప్రధాన ద్వారం తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా సేకరించి దొంగతనానికి పాల్పడ్డారు.
హుండీ పెట్టెను సైతం పగలగొట్టి అందులోని నగదును తీసుకెళ్లారు. దొంగిలించిన వస్తువుల్లో పవిత్ర కలశం, శివలింగంపై అలంకరించిన నాగదేవత విగ్రహం, ఇత్తడి పళ్లాలు, దీపాలు, ఇతర పూజా సామగ్రితో పాటు ఇన్వర్టర్, బ్యాటరీ ఉన్నాయి. మైక్రోఫోన్లు తొలగించిన యాంప్లిఫైయర్‌ను కూడా అక్కడే వదిలేసినట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన భక్తులు ప్రధాన ద్వారం తాళం పగిలి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. ఆలయాన్ని చూసుకునే స్థానిక నివాసి సంతోష్ కుమార్ సక్సేనా అక్కడికి చేరుకుని పరిశీలించారు.
లోపల లైట్లన్నీ ఆపివేసి ఉండటంతో మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ సాయంతో ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో పలు వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారించారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, దుప్పట్లతో శరీరాలను కప్పుకున్న ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. వారు పూజా వస్తువులను సేకరించి, నగదు సహా ఇతర సామగ్రిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్లు ఫుటేజీలో నమోదైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
