Homeనల్లగొండGanja Trafficking Exposed | బ్రేక్‌డౌన్‌తో బయటపడిన గంజాయి అక్రమ రవాణా.

Ganja Trafficking Exposed | బ్రేక్‌డౌన్‌తో బయటపడిన గంజాయి అక్రమ రవాణా.

  • 112 కిలోల గంజాయి స్వాధీనం..
  • ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరారీ.
  • మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ.

సూర్యాపేట: ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 112 కిలోల గంజాయిని సూర్యాపేట రెండో పట్టణ పోలీసులు స్వాధీనం(Ganja Trafficking Exposed) చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె. నరసింహ వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ అక్రమ రవాణాకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఒడిశాలోని జగన్నాథపురి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో రూ.2 వేల చొప్పున 112 కిలోల గంజాయిని రూ.2.24 లక్షలకు కొనుగోలు చేసినట్లు వివరించారు. అనంతరం గంజాయిని 41 ప్యాకెట్లుగా తయారు చేసి ఇన్నోవా కారులో మహారాష్ట్రకు తరలించేందుకు బయలుదేరారని తెలిపారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మరో ఎర్టిగా కారును ఎస్కార్ట్‌గా ముందు నడుపుతూ పోలీసుల కదలికలను గమనించి ఇన్నోవా వాహనానికి సమాచారం అందించేవారని చెప్పారు. ఈ క్రమంలో నవంబర్ 7న సూర్యాపేట పట్టణ శివారులోని ఎన్‌హెచ్‌-65పై పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో ఇన్నోవా కారు బ్రేక్‌డౌన్ కావడంతో నిందితులు వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారని వెల్లడించారు.

- Advertisement -

అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును తనిఖీ చేసిన రెండో పట్టణ పోలీసులు 41 ప్యాకెట్లలో ఉన్న 112 కిలోల గంజాయిని గుర్తించి, వాహనంతో పాటు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వాహనాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు నవంబర్ 12న సూర్యాపేటకు వచ్చిన మహారాష్ట్రకు చెందిన ఆకాష్ విజయ్ దాబేకర్ (23), ఆకాష్ దిలీప్ మోరే (32)లను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు.

జిల్లాలో గంజాయి అక్రమ రవాణా,(Ganja Trafficking Exposed) విక్రయాలు, కొనుగోళ్లు, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించిన పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్సైలు కె. గోపికృష్ణ, బి. రామచంద్రం, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, కానిస్టేబుళ్లు కొండా రమేష్, ఎన్. నవీన్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News