- రైతుల సమక్షంలోనే భూ రికార్డుల ప్రక్షాళన
- సంగోజివాడి,గ్రామసభలో తాడ్వాయి తహసీల్దార్ శ్వేత వెల్లడి…!
తాడ్వాయి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’(Bhu Bharati) సర్వేను రైతులు, ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి తహసీల్దార్ శ్వేత సూచించారు. శుక్రవారం మండలంలోని సంగోజివాడి గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న భూభారతి సర్వేపై గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మరో మూడు, నాలుగు రోజుల్లో గ్రామ శివారులోని 605 ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేయనున్నట్లు తెలిపారు.

భూభారతి సర్వే ముఖ్య ప్రయోజనాలు:
రికార్డుల ప్రక్షాళన: గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను, అసైన్డ్, స్థలాలను గుర్తించడంతో పాటు, రైతుల పట్టా భూములను పక్కాగా సర్వే చేసి రికార్డులను సరిచేస్తామన్నారు.
సాదాబైనామా/కబ్జా భూములకు మోక్షం:

అర్హులైన వాళ్ళు కొన్ని ఏళ్లుగా భూమి కబ్జాలో ఉండి, సరైన రికార్డులు లేని వారికి గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేసి, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కిస్తారు.
సమస్యల పరిష్కారం: భూ వివాదాలు, హద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
భూ సమస్యలు ఏవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, సర్వేకు గ్రామస్తులంతా సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రాజేశం, ఆర్ఐ హారిక, సర్పంచ్ తాజుద్దీన్, కార్యదర్శి సౌమ్య, గ్రామ పెద్దలు లింగారావు, రవీందర్ రావు, భీమ్ రావు, రఫీయుద్దీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
