- మిత్రుడు పూనం నరేష్ కుటుంబానికి రూ.57 వేల ఆర్థిక సాయం…
వెంకటాపురం(నూగూరు): ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు పదో తరగతి పూర్వ విద్యార్థులు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన పూనం నరేష్ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1997–98 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఐక్యంగా స్పందించారు. తమతో కలిసి చదువుకున్న ఆత్మీయ మిత్రుడి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన స్నేహితులు, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మిత్రులందరూ కలిసి రూ.57,000 లు సేకరించి నరేష్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా(Financial Support) అందజేశారు. కష్టకాలంలో మీకు మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
నరేష్ అనారోగ్యానికి గురైన సమయంలో ఆయనను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. వైద్య ఖర్చుల కారణంగా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, మిత్రుడి కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా నిలవాలనే సదుద్దేశంతో ఈ సహాయం అందించినట్లు మిత్రులు తెలిపారు. ఏళ్ల క్రితం పాఠశాలలో ఏర్పడిన స్నేహబంధాన్ని మరువకుండా, మిత్రుడి కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలిచిన 1997–98 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఐక్యత, ఔదార్యాన్ని పలువురు అభినందించారు. మిత్రుల సహకారం, ఆప్యాయత మరువలేనివని పేర్కొన్నారు.

చదువుకున్న నాటి స్నేహాన్ని జీవితాంతం కొనసాగిస్తూ, ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కుప్పిలి రాధాస్వామి, శ్రీను, జక్కుల శ్యామ్, ఆదిలక్ష్మి, సుధారాణి, నాగేంద్రప్రసాద్, వలి హైదర్, రమేష్ వెంకటేశ్వర్లు, శ్రీను, మల్లికార్జున్, హనుమంత్, రాజా రమేష్, శిల్ప, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
