- అధిక ధరలు వసూలు చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు
- అదనపు కలెక్టర్ (పౌర సరఫరాలు) డి. విజయంధర్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకే వివిధ రకాల బియ్యాన్ని విక్రయించాలని(Fixed Rice Prices) అదనపు కలెక్టర్ (పౌర సరఫరాలు) డి. విజయంధర్ రెడ్డి)(D Vijayender Reddy) వ్యాపారులను ఆదేశించారు. నిర్ణయించిన ధరలకు మించి వినియోగదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తే సంబంధిత వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం గరిష్ట విక్రయ ధరలు కిలోకు ఈ విధంగా ఉన్నాయి.
- తెలంగాణ బీపీటీ బియ్యం – రూ.66
- తెలంగాణ సోనా బియ్యం – రూ.74
- తెలంగాణ శ్రీరామ్ గోల్డ్ బియ్యం – రూ.79
రైస్ మిల్లర్లు, రైస్ ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైల్ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఏ వ్యాపారి కూడా నిర్ణీత ధరలకు మించి బియ్యం విక్రయించరాదని పేర్కొన్నారు.
10 క్రిమినల్ కేసుల నమోదు..
జిల్లాలో ఇప్పటికే అధిక ధరలకు బియ్యం విక్రయించిన వ్యవహారాలకు సంబంధించి 10 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, సివిల్ సప్లై శాఖ అధికారులు ప్రతిరోజూ బియ్యం విక్రయ కేంద్రాలు, రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
దుకాణాల ముందు ధరల బ్యానర్లు తప్పనిసరి
ప్రతి హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారి తమ దుకాణం ముందు ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరలను స్పష్టంగా తెలిపే బ్యానర్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. వినియోగదారులకు ధరలపై అవగాహన కల్పించడంతో పాటు పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు న్యాయమైన ధరలకు బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా వ్యాపారులందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించి అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ డి. విజయంధర్ రెడ్డి కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
