Homeహైదరాబాద్‌KTR | నెల రోజుల్లోనే మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌

KTR | నెల రోజుల్లోనే మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌

  • మస్కట్‌లో చిక్కుకున్న మహిళను సురక్షితంగా స్వదేశానికి రప్పించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
  • “నా కొడుకుకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను ఇంటికి తీసుకొచ్చారు.. కేటీఆర్‌(KTR ) అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా”

హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి మోసపోయి మస్కట్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ మహిళను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR ) చొరవ చూపించారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని తన కుమారుడికి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని బాధిత కుటుంబంలో ఆనందం నింపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన గోకాఫసల్‌వాడ గ్రామ నివాసి తుప్పుడు లక్ష్మి, భర్త వెంకటప్ప, మస్కట్‌ నుంచి సురక్షితంగా తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

KTR Brings Telangana Woman Back from Muscat01

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను లక్ష్మి స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో అండగా నిలిచి, తనను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు.

- Advertisement -

కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో లక్ష్మి ఫిబ్రవరి 27న ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్‌ చెప్పిన పని కాకుండా మరో పని అప్పగించారని, యజమాని (కఫీల్‌) ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకొని తిరిగి భారత్‌కు పంపేందుకు నిరాకరించారని ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు పంపించిన ఏజెంట్‌ కూడా ఆమె ఫోన్‌ కాల్స్‌కు స్పందించకుండా, తిరిగి పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

KTR Brings Telangana Woman Back from Muscat2

ఈ క్రమంలో ఆమెకు అందుబాటులో ఉన్న వైఫై, సిమ్‌ సేవలు నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్ష్మి, చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్‌ సహాయంతో తన కుమారుడు రాజును సంప్రదించి అక్కడ పడుతున్న కష్టాలను వివరించారు.

తల్లి పరిస్థితి తెలుసుకున్న రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలనే ఆశతో సెప్టెంబర్‌ 29న కేటీఆర్‌ను కలిసి కుటుంబ పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. లక్ష్మి పాస్‌పోర్టు తిరిగి ఇప్పించి, నెల రోజుల్లోగా సురక్షితంగా భారత్‌కు తీసుకొస్తానని రాజుకు హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్‌ సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు, అవసరమైన చర్యలు తీసుకునేలా చొరవ చూపించారు. దీంతో లక్ష్మి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. తల్లి తిరిగి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

KTR Brings Telangana Woman Back from Muscat02

తన కష్టకాలంలో అండగా నిలిచి మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌ను కలిసిన లక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. “కేటీఆర్‌ అన్న నా కొడుకుకు నెల రోజుల్లోనే నిన్ను ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే నన్ను సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఆయన చేసిన సహాయాన్ని నేను, నా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేం. కేటీఆర్‌ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం” అని లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News