Homeకరీంనగర్Stray Dog Attack | చిన్నారిపై కుక్క దాడి.. అయినా స్పందించని మున్సిపల్ యంత్రాంగం!

Stray Dog Attack | చిన్నారిపై కుక్క దాడి.. అయినా స్పందించని మున్సిపల్ యంత్రాంగం!

  • ఆరేళ్ల శిర్వేష్‌పై వీధికుక్క దాడి..
  • కమిషనర్‌కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని వైనం
  • ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమెంత?

జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పట్టణంలోని 21వ వార్డులో ఆరేళ్ల చిన్నారి శిర్వేష్‌పై వీధికుక్క దాడి(Stray Dog Attack) చేసి కరవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. చిన్నారులపై వీధికుక్కలు దాడులకు పాల్పడుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చిన్నారుల భద్రతకు భరోసా ఏదీ?

- Advertisement -

పట్టణంలోని పలు కాలనీలు, వార్డుల్లో వీధికుక్కల(Stray Dogs) సంచారం పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధుల వెంటపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్య పరిష్కారానికి సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కమిషనర్‌కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని వైనం!

ఆరేళ్ల చిన్నారి శిర్వేష్‌పై కుక్క దాడి జరిగిన విషయంపై మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ప్రజలకు సంబంధించిన ఇంతటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫోన్ అందుబాటులోకి రాకపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఘటనలు జరిగినప్పుడే స్పందిస్తారా?

వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కుక్కల బెడదను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో తగిన భద్రత కల్పించాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా మేల్కొనాలి!

చిన్నారి శిర్వేష్‌పై జరిగిన కుక్క దాడిని అధికారులు తీవ్రంగా పరిగణించాలని స్థానికులు కోరుతున్నారు. వీధికుక్కల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో చిన్నారి కుక్కకాటుకు గురికాకముందే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల భద్రత మున్సిపల్ శాఖ బాధ్యత కాదా? చిన్నారులపై దాడులు జరిగినా అధికారుల్లో చలనం లేదా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కోరుట్ల పట్టణంలో వినిపిస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News