Homeఆదాబ్ ప్రత్యేకంMusi River Encroachment | మూసీని కాపాడేది ఎవరు..?

Musi River Encroachment | మూసీని కాపాడేది ఎవరు..?

  • కబ్జా కోరల్లో మూసీ నది.. అధికారుల మౌనం!
  • నిబంధనలు తుంగలో.. మట్టితో పూడ్చివేత!
  • మోకిలా సర్వే నంబర్ల సాక్షిగా అక్రమ పర్వం
  • అస్తవ్యస్తంగా మారుతున్న మూసీ ప్రవాహం
  • రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై ఆరోపణలు
  • చర్యలు ఎప్పుడని ప్రశ్నిస్తున్న స్థానికులు

హైదరాబాద్ మహానగరానికి చారిత్రాత్మక జీవనది అయిన మూసీ ఉనికి ఇప్పుడు పశ్చిమ రంగంలో తీవ్ర సంక్షోభంలో పడింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో రియల్ మాఫియా ఆకలికి సరిహద్దులు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాలు మూసీ పునరుజ్జీవనం, బ్యూటిఫికేషన్ అంటూ కోట్ల రూపాయల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం నదిని నిలువునా పూడ్చేసేందుకు రియల్టర్లు బరితెగించారు.

మూసీ నది పునరుజ్జీవనం పేరుతో ప్రభుత్వం ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతుండగా, మరోవైపు నది ప్రవాహ మార్గం, బఫర్ జోన్‌లో విచ్చలవిడిగా మట్టి నింపడం, కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకిలా గ్రామ పరిధిలోని రెవెన్యూ సర్వే నంబర్లు203, 204, 205, 206లో మూసీ బఫర్ జోన్‌లో(Musi River Encroachment) భారీగా మట్టి నింపి నది ప్రవాహ మార్గానికి అడ్డంకి కల్పిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఘటన మూసీ పునరుజ్జీవన ప్రక్రియలో అధికార యంత్రాంగం ఎంతవరకు సమన్వయంగా పనిచేస్తోందనే ప్రశ్నను తీవ్రంగా లేవనెత్తుతోంది.

- Advertisement -

నిబంధనలు తుంగలో.. మట్టితో పూడ్చివేత! : మోకిలా గ్రామ పరిధిలో మూసీ నది పక్కన ఉన్న బఫర్ జోన్‌లో పెద్ద ఎత్తున మట్టి నింపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నది ప్రవాహ మార్గం సహజంగా ఉండాల్సిన చోట మట్టి పేర్చడం వల్ల వర్షాకాలంలో నీరు ప్రవహించే వెడల్పు తగ్గిపోతుందని, దీంతో పరిసర ప్రాంతాల్లో వరద ప్రమాదం పెరిగే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారం నది పరివాహక ప్రాంతాల్లో, బఫర్ జోన్లలో ఎలాంటి శాశ్వత లేదా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టకూడదు. కనీసం మట్టి తోలి నది రూపురేఖలను మార్చడానికి వీల్లేదు. కానీ, మోకిలా రెవెన్యూ పరిధిలో రియల్టర్ల దూకుడుకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

చుట్టుపక్కల ఉన్న సహజ వాగులు, చెరువుల నుంచి వచ్చే వర్షపు నీరు మూసీ నదిలోకి వెళ్లకుండా(Musi River Encroachment) నది గర్భంలోనే అడ్డుగా పెద్ద ఎత్తున మట్టిని నింపేశారు. సుమారు 300 మీటర్ల పొడవునా నది ప్రవాహ మార్గాన్ని పూడ్చివేయడంతో, రానున్న రోజుల్లో స్వల్ప వర్షాలకే చుట్టుపక్కల గ్రామాలు, పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూసీ నది పరిరక్షణ కోసం నది సరిహద్దుల నుంచి 50 మీటర్ల బఫర్ జోన్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో కొత్త లేఅవుట్లు, భవన నిర్మాణాలు, అభివృద్ధి కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వకూడదని జిహెచఏంసి సూచించింది. అయితే, ఈ నిబంధనలు ఇలా ఉండగా, మోకిలా పరిధిలో మాత్రం మట్టి నింపడం ద్వారా నది ప్రవాహ మార్గాన్నే మార్చే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మోకిలా సర్వే నంబర్ల సాక్షిగా సాగుతున్న అక్రమ పర్వం.. : మోకిలా గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 203, 204, 205, 206లు నేరుగా మూసీ నది ప్రవాహ మార్గానికి ఆనుకుని ఉన్నాయి. వర్షపు నీరు సహజ వాగులు, చెరువుల గుండా ప్రవహించి మూసీలోకి చేరడానికి ఇవి అత్యంత కీలకమైన పాయింట్లు. అయితే, ఈ సర్వే నంబర్లలోని భూములను వాణిజ్య పరంగా వాడుకునేందుకు, విల్లాలు, పెద్ద పెద్ద వెంచర్లు వేసేందుకు రియల్టర్లు పక్కా ప్లాన్ ప్రకారం నదిని కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని, నిర్మాణ వ్యర్థాలను తెచ్చి నది అంచుల్లో కుమ్మరిస్తున్నారు. నది సహజ సిద్ధమైన వెడల్పును కుదించి, ప్రవాహ దిశను మార్చేలా సాగుతున్న ఈ ఘోరంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు గుండెలు బాదుకుంటున్నారు.

కనిపించని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు.. : నది పరిరక్షణ, నీటి వనరుల రక్షణే ధ్యేయంగా పనిచేయాల్సిన ఇరిగేషన్ (నీటి పారుదల)శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అసలు కనిపించడమే లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున యంత్రాలతో నదిలోకి మట్టిని తోలుతుంటే, ఉన్నతాధికారులకు సమాచారం లేదా? లేక తెలిసి కూడా కళ్లు మూసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అటు రెవెన్యూ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు పరస్పరం బాధ్యతలు నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప, కబ్జాలను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమ య్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను ఉల్లం ఘించి నదిని పూడ్చుతున్న రియల్టర్లకు, కొంతమంది అధికారు లకు అంతర్గత ఒప్పందాలు, భారీగా చేతులు మారిన ముడుపుల వ్యవహారాలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అస్తవ్యస్తంగా మారుతున్న మూసీ ప్రవాహం.. : సహజ సిద్ధంగా ప్రవహించే మూసీ నది మార్గాన్ని మట్టితో పూడ్చడం వల్ల నది వెడల్పు తగ్గిపోతోంది. ఇది కేవలం శంకర్‌పల్లి పరిధిలోనే కాకుండా, ఇక్కడి నుంచి దిగువకు వెళ్లే హైదరాబాద్ నగర పరివాహక ప్రాంతాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం రియల్టర్లు నదిని కనుమరుగు చేసేలా వ్యవహరిస్తున్నారు. మోకిలా పరిధిలో వరద నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోతే, వర్షాకాలంలో గండ్లు పడి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

చర్యలు ఎప్పుడు.. ? స్థానికుల డిమాండ్.. : మా కళ్ల ముందే నదిని మట్టితో పూడ్చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అంతా అయిపోయాక నోటీసులు ఇస్తారా? అని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, హైడ్రా బృందాలు, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి శంకర్‌పల్లి మండలంలోని మోకిలా గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 203, 204, 205, 206లలో జరిగిన కబ్జాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా వేసిన మట్టిని తొలగించి, నది సహజ ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని, ఇందుకు కారణమైన రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అలాగే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మూసీ నదికి రక్షణ దొరుకుతుందని స్పష్టం చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలే ఆధారం.. మూసీ పరిరక్షణకు చట్టబలం! : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి 2024 నవంబర్ 12న జారీ చేసిన ఉత్తర్వులు మూసీ నది పరిరక్షణ, నది పరిధిలోని ఆక్రమణల అంశంలో కీలకమైనవిగా పేర్కొనబడుతున్నాయి. నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించే చర్యలు, బఫర్ జోన్ నిబంధనల ఉల్లంఘనలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ అంశం ముందుకు తెస్తోంది. మోకిలా పరిధిలోని మూసీ నది సమీపంలో మట్టి నింపడం, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కోర్టు ఉత్తర్వులు వర్తించే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News