- 11వ శతాబ్దపు ప్రాచీన ఆలయాన్ని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
శంకర్పల్లి: ఆధ్యాత్మిక శోభకు,ప్రాచీన చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామ శివారులోని శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం(Marakatha Shiva Temple) గురువారం ప్రముఖుల సందర్శనతో ఆధ్యాత్మిక సందడి సంతరించుకుంది.తెలంగాణ హైకోర్టు సెకండ్ బెంచ్ న్యాయమూర్తి సుమలత రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
11వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయంలో న్యాయమూర్తి సుమలత రెడ్డి స్వామివారికి అభిషేకం చేసి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆలయ ప్రాంగణంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కడకంచి కుమార్ యాదవ్ న్యాయమూర్తి సుమలత రెడ్డి కుటుంబ సభ్యులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి ఆలయ సంప్రదాయం ప్రకారం గౌరవించారు.
పురాతన ఆలయంపై న్యాయమూర్తి ప్రశంసలు
ఈ సందర్భంగా జడ్జి సుమలత రెడ్డి మాట్లాడుతూ.. పురాతన మరకత శివాలయాన్ని(Marakatha Shiva Temple) దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ఆలయ ప్రాచీనత,ఆధ్యాత్మిక వాతావరణం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ సీహెచ్ నర్సింలు,కోశాధికారి ప్రశాంత్ గౌడ్, అన్నప్రసాద కమిటీ చైర్మన్ కడకంచి అంజయ్య, వెంకటస్వామి,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
