- బీఆర్ఎస్ నేతలు భ్రమల్లో ఉన్నారు.. బీజేపీకి భవిష్యత్తు లేదు
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు భ్రమల్లో ఉన్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడం లేదని విమర్శించారు. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.
సచివాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, నవంబర్ నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమన్వయం దేశంలో మరే పార్టీలోనూ లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారని, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను కూడా గమనించానని తెలిపారు.
కేసీఆర్‌పై విమర్శలు.. బీజేపీపై ధీమా
కేసీఆర్‌ను మేధావిగా భావించినప్పటికీ, సరైన ఆలోచన లేకుండా అప్పులు చేశారని మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని వ్యాఖ్యానించారు. ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాలు గెలుచుకున్నా బీజేపీకి గొప్ప విషయమేనని అన్నారు.
సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు బలం
సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారులు తమకు అండగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు 90 వేల ఉద్యోగాలు కల్పించామని, ఆ ఉద్యోగాలు పొందినవారంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా పార్టీ శాశ్వతమని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పారు.
ఎల్‌నినోపై హరీశ్‌రావు వ్యాఖ్యలకు కౌంటర్
ఎల్‌నినో అంశంపై హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను మహేశ్‌కుమార్ గౌడ్ తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 40 శాతం సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో వంద సీట్ల లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుందని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
