Homeహైదరాబాద్‌Baburam Naik | తెలంగాణలో సన్న బియ్యం ధరల దోపిడీ!

Baburam Naik | తెలంగాణలో సన్న బియ్యం ధరల దోపిడీ!

  • రూ.5,400 బియ్యం రూ.9,500కు విక్రయం?
  • సిండికేట్లపై రాష్ట్రవ్యాప్త దర్యాప్తు చేపట్టాలి
  • ఆర్‌టీఐఎస్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాబురామ్ నాయక్ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో సన్న బియ్యం ధరల పెరుగుదలపై ఆర్‌టీఐఎస్‌ఎస్(RTISS) వ్యవస్థాపక అధ్యక్షుడు బాబురామ్ నాయక్(Baburam Naik) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమైనట్లు చెబుతున్న ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందని, కొందరు మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, కిరాణా దుకాణదారులు కుమ్మక్కై బియ్యం ధరలను పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. క్వింటాల్‌కు రూ. 5,400 స్థాయిలో ఉండాల్సిన బియ్యాన్ని రూ. 9,000 నుంచి రూ. 9,500కు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించడం నుంచి బియ్యం వినియోగదారుడికి చేరే వరకు సరఫరా వ్యవస్థలో పారదర్శకత ఉండాలని బాబురామ్ నాయక్(Baburam Naik) అన్నారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు నిజమైతే, అటువంటి వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కిలో సన్న బియ్యం ధర రూ.95కు చేరుతోందన్న ఫిర్యాదులు సామాన్య కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం

రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, దినసరి కార్మికుల కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల భారంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరమైన బియ్యం ధరలు అందుబాటులో లేకపోతే పేద కుటుంబాల జీవన వ్యయం మరింత పెరుగుతుందని అన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయాల్సి రావడంతో అదనపు ఖర్చులు తప్పడం లేదని తెలిపారు.

కలెక్టర్లు తక్షణమే స్పందించాలి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యం ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు, హోల్‌సేల్ గోదాములు, కిరాణా దుకాణాల్లో ధరల వివరాలు, కొనుగోలు బిల్లులు, నిల్వల రికార్డులను పరిశీలించాలని కోరారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరల విక్రయం వంటి ఉల్లంఘనలు నిర్ధారణ అయితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

బియ్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులెవరైనా ఉపేక్షించకుండా చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

పేద ప్రజల ఆహార భద్రతను దెబ్బతీసే పరిస్థితులను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని బాబురామ్ నాయక్ హెచ్చరించారు. బియ్యం ధరల సమస్యపై తక్షణమే స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News