Homeహైదరాబాద్‌Boora Narsaiah Goud | రాజ్యాంగంపై ఉపన్యాసాలిచ్చే ముందు రాహుల్‌ గాంధీ దాన్ని చదవాలి

Boora Narsaiah Goud | రాజ్యాంగంపై ఉపన్యాసాలిచ్చే ముందు రాహుల్‌ గాంధీ దాన్ని చదవాలి

  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్‌ విమర్శ

హైదరాబాద్‌: రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రదర్శించడం కాదని, దాని నిబంధనలను అర్థం చేసుకుని గౌరవించడమే నిజమైన రాజ్యాంగ(Constitution) పరిరక్షణ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్‌(Boora Narsaiah Goud) కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీపై(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. దేశానికి రాజ్యాంగ పాఠాలు చెప్పే ముందు ఆయన రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి, దాని ప్రక్రియలను అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)ను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్‌ గాంధీ కోరడం రాజ్యాంగ ప్రక్రియపై ఆయన అవగాహనను ప్రశ్నించేలా ఉందని నర్సయ్య గౌడ్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల తొలగింపునకు నిర్దిష్టమైన విధానాలు ఉంటాయని, వాటిని విస్మరించి రాజకీయ డిమాండ్లు చేయడం సమంజసం కాదన్నారు.

- Advertisement -

రాజ్యాంగంలోని 324(5) అధికరణ ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తొలగింపునకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు వర్తించే విధానమే అనుసరించాల్సి ఉంటుందని వివరించారు. నిరూపిత దుర్వ్యవహారం లేదా అసమర్థత వంటి కారణాలపై పార్లమెంటు ఉభయ సభల్లో నిర్దేశిత ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందిన తర్వాతే రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వులు జారీ చేయగలరని పేర్కొన్నారు.

ప్రధాని అయినా, ప్రతిపక్ష నేత అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఇష్టానుసారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించలేరని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకే రాజ్యాంగం ఇటువంటి రక్షణలు కల్పించిందన్నారు.

సీఈసీపై రాహుల్‌ గాంధీకి నిజంగా అభ్యంతరాలు ఉంటే నిర్దిష్టమైన ఆరోపణలు, విశ్వసనీయమైన ఆధారాలతో రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని సూచించారు. తీవ్రమైన ఆరోపణలు చేసే సమయంలో ఆధారాలు చూపాలే తప్ప, రాజకీయ నాటకీయతకు ప్రాధాన్యం ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో ప్రతిపక్ష నేత పదవి కీలకమైనదని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలంటే రాజ్యాంగ పరిజ్ఞానం, వాస్తవాలపై అవగాహన, నిర్మాణాత్మక చర్చ అవసరమని నర్సయ్య గౌడ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించడం కంటే అందులోని విలువలను, నిబంధనలను గౌరవించడం ముఖ్యమన్నారు.

“రాజకీయ కామెడీని ఆపండి.. రాజ్యాంగంపై అవగాహన పెంచుకోండి.. దేశ భవిష్యత్తుపై అర్థవంతమైన చర్చకు రండి” అని రాహుల్‌ గాంధీకి సూచించారు. వాస్తవాలు, ఆధారాలు, నిర్మాణాత్మక విమర్శలతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం దేశానికి అవసరమని, రాజ్యాంగ సంస్థలను రోజువారీ రాజకీయ ఘర్షణలకు వేదికలుగా మార్చడం తగదని డా. బూర నర్సయ్య గౌడ్‌ పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News