- తాసిల్దార్ కు మెమొరండం అందజేత
తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు ధర్నా(Farmers Protest) కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని, వారు డిమాండ్ చేశారు. అనంతరం కిసాన్ సన్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సమస్యల పరిష్కారానికై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీని వడ్డీతో సహా అమలు చేసి ఖాతాల్లో జమ చేయాలని, నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ చెల్లించాలని, మూడేళ్ల రైతుభరోసా బకాయిలను కౌలు రైతులతో కలిపి ఎకరాకు రూ. 45,000 తక్షణమే చెల్లించడంతో పాటు భూమిలేని రైతు కూలీలకు రూ. 36,000 ఆర్థిక సాయం అందించాలని కోరారు.

రైతుబీమాను రూ. 10 లక్షలకు పెంచాలని, పట్టా భూములను 22 A నిషేధిత జాబితా నుంచి తొలగించి పోడు, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని నేతలు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కమతాలకు బాటలు నిర్మించాలని, వన్యప్రాణుల దాడి, కరువు వల్ల నష్టపోయిన పంటలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను పునఃప్రారంభించి చెరకు టన్నుకు రూ. 5,000 ధర నిర్ణయించాలని, ట్రాక్టర్ ట్రాలీలను వ్యవసాయ పనిముట్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో దళారుల దోపిడీ, తూకం మోసాలను అరికట్టి ప్రతి గింజనూ ప్రభుత్వమే సేకరించాలని, అలాగే సేంద్రీయ సాగు, పశుపోషణకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని రైతు సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవ అధ్యక్షులు దేవి రెడ్డి విట్టల్ రెడ్డి, సభ్యులు సంతోష్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, నర్సా రెడ్డి, సంగ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
