- భారతీయ సనాతన జీవన విధానమే శాశ్వత మార్గం..
- ఆధునికత ముసుగులో పరుగులు పెడుతున్నాం..
- కోరి కోరి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నాం..
- ఉరుకులు, పరుగుల జీవితాల్లో అడుగడుగునా ప్రమాదాలే..
- కష్ట చేయడం మరచిపోయాం.. కన్నీళ్లతో బ్రతుకుతున్నాం..
- టెక్నాలజీని నమ్ముకుని ముళ్లబాటలో పయనిస్తున్నాం..
- అభివృద్ధి పేరుతో ఆపదలకు ఎదురెళ్తున్నాం..
- పెద్దల మాట చద్దెన్నం మూట అనే మాటను మరిచిపోతున్నాం..
కోడి కూతతో వేకువఝామున నిద్రలేచి.. వేప పుల్లతో దంతధావనం చేసుకుని.. మట్టి కుండలో కాచిన నీళ్లతో స్నానం చేసి.. ఉతికిన బట్టలు కట్టుకుని.. చద్దన్నం భోంచేసి.. నాగలి భుజానికెత్తుకొని.. పొలానికి వెళ్లి పక్షుల కిల కిలారావాలను ఆస్వాదిస్తూ.. ప్రకృతి ఒడిలో పరవశిస్తూ.. పొలాల్లోని మట్టిలో దిగి వ్యవసాయం చేస్తూ.. 10 గంటలకు ఇంటినుంచి వచ్చే అన్నం తిని.. ఓ పదినిమిషాలు విశ్రాంతి తీసుకుని.. తిరిగి పనిలో పడి మధ్యాహ్నం రాగి సంగటి తిని.. పని చేసుకుని 5 గంటలకు ఇంటికి వచ్చి చల్లని నీటితో స్నానం చేసి, పెందలకడనే భోంచేసి వూర్లో రచ్చబండ దగ్గర ఓ అరగంట స్నేహితులతో పిచ్చాపాయి మాట్లాడుకుని 8 గంటలకల్లా నిద్రపోయే..
ఒకప్పటి మనిషికి అనారోగ్యం అంటే ఏమిటో తెలిసేది కాదు.. వాళ్లకు ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమిటో తెలియదు.. ఫ్రిడ్జ్, ఏసీ అంటే తెలియదు.. కాయకష్టం చేయడం, కడుపారా తినడం.. కంటినిండా నిద్రపోవడం.. కల్లా కపటం తెలియకుండా నిజాయితీగా జీవించడం ఇది మాత్రమే తెలుసు.. మరి అప్పట్లో ఎలాంటి కార్పొరేట్ ఆసుపత్రులు లేవు.. కేవలం నాటు వైద్యం మాత్రమే.. అయినా అప్పటి పెద్దలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించేవారు.. కారణం వారు ప్రకృతిని విధ్వంసం చేయకపోవడమే..

ప్రాణవాయువునిచ్చే చెట్లను పెంచడం.. రేడియేషన్ లేని వస్తువులు ఉపయోగించడం.. చేతి పనిముట్లు వాడటం.. సేంద్రియ వ్యవసాయం చేయడం.. ఇలా అసలు సిసలు మనుషుల్లా జీవించడమే.. మరి ఇప్పుడు మనమేం చేస్తున్నాం..? ఆధునికత, సాంకేతికత పేరుతో ప్రకృతిని చెరబడుతున్నాం.. ఫలితం.. విపత్తులు, పేరుకూడా తెలియని రోగాలు.. జీవన ప్రమాణం 50 ఏళ్లకు పడిపోయింది.. ఇది మనం చేతులారా చేసుకున్న పాపమే.. టెక్నాలజీ పేరుతో తెగబడుతున్న ఆధునిక జీవన విధానంపై ‘ ఆదాబ్ ‘ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం..
“అభివృద్ధి.. అభివృద్ధి..” అంటూ యావత్ ప్రపంచం ఆధునికత ముసుగులో విపరీతమైన పరుగు పెడుతోంది. కానీ ఈ ప్రగతి రథ చక్రాల కింద నలిగిపోతున్నది ఎవరు? మనమే.. మనం సృష్టించుకున్న సాంకేతికత నేడు మన ఉనికిని, మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. అసలు ఈ టెక్నాలజీని(Technology Impact) ఎవడు కనిపెట్టమన్నాడు? ఈ ఆధునిక ఆవిష్కరణలే నేడు మానవజాతికి పెను శాపాలుగా మారుతున్నాయి.
సౌకర్యాల పేరుతో ఆరోగ్యాలు బుగ్గిపాలు :
నేడు గ్లోబల్ వార్మింగ్ విలయతాండవం చేస్తోంది. భూమి ఉష్ణోగ్రతలు అదుపుతప్పుతున్నాయి. నలుదిశలా ప్రాణాంతక రేడియేషన్ ముప్పు ముంచుకొస్తోంది. నిపుణులు ఇప్పుడు ఏమని హెచ్చరిస్తున్నారో తెలుసా..? ఏసీలు ఆపేయండి.. స్మార్ట్ ఫోన్లను దూరంగా పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి.. వాటర్ హీటర్లు, గీజర్లు వాడకండి.. ప్రెజర్ కుక్కర్లు వాడటం తగ్గించండి.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దురదృష్టం ఏమిటంటే మనిషి తన సౌకర్యం కోసం కనిపెట్టిన ప్రతి కృత్రిమ వస్తువు వెనుక నేడు ఒక ప్రాణాంతక అనారోగ్యం, పర్యావరణ ముప్పు పొంచివుంది. మనం సౌలభ్యం అనుకుంటున్న ఈ టెక్నాలజీ(Technology Impact) కాస్తా మన ఆయువును, భావి తరాల భవిష్యత్తును హరించే ఉరితాడవుతోంది.

కాలపరీక్షను తట్టుకుని నిలిచిన భారతీయ ఋషుల విజ్ఞానం :
లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, భారతీయ ఋషులు అందించిన ఆవిష్కరణలను ఒక్కసారి పరిశీలించండి. వాటిలో ఏ ఒక్క దానివల్లనైనా ప్రపంచానికి, ప్రకృతికి ఇబ్బంది వచ్చిందా? లేదు.. ఇది వాస్తవం.. అనాదిగా వస్తున్న మట్టి కుండను నేటికీ ఎవరైనా పక్కన పెట్టమన్నారా? మట్టి కుండలో నీరు ఎలాంటి ఇతర సమస్యలు లేకుండా, నేటికీ అమృతంతో సమానంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతోంది. మట్టికుండలో వండిన వంటకాలు అద్భుతమైన రుచిగా ఉంటాయి.. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు.. రాత్రిళ్ళు చెట్లకింద పడుకుంటాం.. ప్రాణవాయును పీల్చుకుంటూ కంటినిండా నిద్రపోతాం.. అనారోగ్యాలు మన దరిచేరవు .. పెద్ద మట్టి బానలో కట్టెల పొయ్యిమీద నీళ్లు కాచుకుని స్నానం చేస్తాం..
శరీరం ఎంతో ఆహ్లాదకరముగా ఉంటుంది.. ఎలాంటి క్రిములూ మన శరీరానికి అంటవు.. అలాగే కట్టెల పొయ్యిమీద వంటకాలు చేసుకుంటాం.. అవి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి.. పైగా ఆహార పదార్ధాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. అలాగే సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేస్తాం.. పండిన పంటలు ఎంతో రుచికరంగా ఉంటాయి.. కలుషితం కాకుండా ఉంటాయి.. ఆరోగ్యాన్నిస్తాయి.. మన పూర్వీకులు అందించిన ప్రతి జీవన సూత్రం, ప్రతి ఆవిష్కరణ కాల పరీక్షను తట్టుకుని నిలబడింది.
ప్రకృతితో మమేకమైన ఆ విజ్ఞానం ఏనాడూ భూమికి భారంగా మారలేదు. ఇది మనం ఖచ్చితంగా గమనించాలి.. ఆలోచించాలి.. అలాగే ఇంటిముందు పేడతో కలిపిన నీళ్లతో కళ్ళాపు చల్లి.. చక్కని ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతాం.. ఇంటి గుమ్మానికి పసుపు రాస్తాం.. దానితో విషపు కీటకాలు, విష సర్పాలు, తేళ్లు, జర్రులు లాంటివి ఇంటిలోకి రాకుండా ఉంటాయి.. ఇవన్నీ మన పూర్వికులు ఎంతో ఆలోచన చేసి మనకు అందించిన విజ్ఞానపు గనులు..
కానీ రాను రాను మనం సుఖాలకు అలవాటు పడ్డాం.. త్వర త్వరగా పని అయిపోవాలని అనుకుని, సులభంగా పూర్తి అయ్యేలా సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నాం.. కట్టెల పొయ్యి స్థానంలో కుక్కర్లు, నీళ్లు వేడి చేసుకోవడానికి గీజర్లు, సాంప్రాదాయ వంటకాలను పక్కనబెట్టి, పిజ్జాలు, బర్గర్లు తినడం.. సేంద్రీయ ఎరువులతో కాకుండా రసాయనాలతో పంటలు పండించడం.. ఇలా ఎన్నెన్నో చేస్తున్నాం.. మిషన్లతో వ్యవసాయం చేస్తున్నాం.. శారీరక శ్రమను పక్కన పెట్టేశాం.. దాంతో శరీరం తన శక్తిని కోల్పోతోంది.. అలాగే రసాయనాలతో పండించిన వాటిని ఆహారంగా భుజిస్తున్నాం.. ఆరోగ్యం చెడిపోతోంది.. అలాగే ఏసీ గదుల్లో శయనిస్తున్నాం.. ఇది కూడా ప్రమాదాలు కొనితెచ్చిపెడుతోంది..
ఒకప్పుడు తపాలా శాఖ ద్వారా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.. ఇప్పుడు సెల్ ఫోన్స్, వాట్స్ ఆప్ స్టేటస్ లు, సోషల్ మీడియా.. వీటివల్ల మనలోని భావుకత సన్నగిల్లిపోతుంది.. ఆప్యాయతానురాగాలు మరుగునపడి పోతున్నాయి.. కుటుంబ వ్యవస్థ సన్నగిల్లుతోంది.. మనుషుల్లో దూరం పెరిగిపోతోంది.. పైగా సెల్ ఫోన్స్ వల్ల రేడియేషన్ పెరిగిపోయి ప్రకృతితో పాటు మానవ ఆరోగ్యం కూడా సర్వనాశం అవుతోంది.. అదే విధంగా పరిశ్రమలు కూడా.. వాటినుంచి వచ్చే కాలుష్యం ప్రకృతిని చెరబడుతోంది.. దాంతో విపత్తులు ఎదురవుతున్నాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. టెక్నాలజీ(Technology Impact) అనేది మానవుడికి ఉపయోగ పడేంతవరకే వినియోగించుకోవాలి.. అంతేగానీ మానవ వినాశనానికి కాదు అని గ్రహించాలి.. ఏదైనా మితంగా ఉండాలి.. అందుకే పెద్దలు అంటుంటారు అతి సర్వత్రా వజ్రాయేత్ అని.. అతి అనేది ఎప్పటికైనా ప్రమాదమే..

అసలు విష సంస్కృతి ఎవరిది?
ఈనాటి ఆధునిక మద్యం (వైన్, విదేశీ లిక్కర్లు) సంస్కృతిని చూడండి. రసాయనాలతో తయారవుతున్న ఈ లిక్కర్లను తాగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, కొంపలు నాశనమైపోతున్నాయి. ఈ విష సంస్కృతిని బంద్ చేయాలని నేడు ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, లక్షల సంవత్సరాల నుంచి మనవాళ్ళు ఆస్వాదించింది ఏమిటి? ప్రకృతి సిద్ధంగా లభించే తాటి కల్లు, ఈత కల్లు! స్వచ్ఛమైన నాటు ఇప్పసారా! ఈ ప్రకృతి సహజ సిద్ధమైన పానీయాల వల్ల ఏనాడైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చరిత్ర చెబుతుందా? అది కేవలం ఒక పానీయం కాదు.. మన మట్టి వాసన ఉట్టిపడే ఒక స్వచ్ఛమైన జీవన విధానం.
దురదృష్టం ఏమిటంటే.. టెక్నాలజీని మనమే సృష్టించుకుంటాం.. మనమే దానిని వాడకూడదు అంటున్నాం.. అలాంటప్పుడు ఎందుకు ఈ టెక్నాలజీ.. మానవ మనుగడకు ముప్పుగా పరిణమించే టెక్నాలజీ ఎందుకు..? కానీ మన పూర్వికులు అందించిన అలవాట్లు ఇప్పటికీ వాడుతున్నాం.. ఏరోజైనా వాటిని పక్కన పెడదాం అన్న ఆలోచ్చయన గానీ, ప్రమాదం గానీ ఎదురైందా..? ఇది అందరూ గ్రహించాల్సిన వాస్తవం..
ఎవరిది నిజమైన చరిత్ర?
తెలియకపోతే మౌనంగా ఉండాలి, కానీ గొప్ప చరిత్ర ఉన్న మన సంస్కృతిని విస్మరించకూడదు. ఎవరిది నిజమైన ఘన చరిత్ర? తరతరాల నిఖార్సయిన మన పూర్వీకుల చరిత్రే ఈ ప్రపంచానికి అసలైన మార్గదర్శకం. మన వేళ్లతో మనమే మన ఇళ్లను కాల్చుకునే ఈ ‘అభివృద్ధి’ మోజును వదిలిపెట్టి, ప్రకృతితో నడిచే నిజమైన జీవన వైభవాన్ని అర్థం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మేల్కొందాం.. ప్రకృతిని, మన సనాతన సంస్కృతిని కాపాడుకుందాం!
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అప్పట్లో మట్టి కుండలు, పింగాణీ వస్తువులు వాడేవాళ్ళం.. ఇప్పుడు ప్లాస్టిక్, సింథటిక్ వాడుతున్నాం.. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి.. రోగాలు ఎక్కువవుత Tన్నాయి.. ఒకప్పుడు రోగం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్తే నాడీ పట్టుకుని వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం చేసేవాళ్ళు.. ఇప్పుడు మనం మన సమస్యలు చెబితే విని మందులు ఇస్తున్నారు.. అంటే డాక్టర్లకు సైతం అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి..
ఇవన్నీ భేషజాలకు పోయి మనం వాడుతున్న రసాయన మిళితమైన వస్తువులు, ఆహారం.. కట్టెల పొయ్యిలు కను మరుగై పోయాయి.. సేంద్రీయ వ్యవసా యానికి చెల్లుచీటీ ఇచ్చేశాం.. శారీరక శ్రమను వదిలి పెట్టేశాం.. ఇలా ఎన్నెన్నో మన పూర్వీకులు మనకు ఇచ్చిన సాంప్రదాయాలను వదిలి పెట్టేశాము.. ఇప్పటికైనా మేల్కొనకపోతే.. మాన వజాతి ఈ భూమ్మీద అంతరించే పెను ప్రమాదం ఎదురవుతుంది.. దయచేసి వాస్తవాలు గ్రహించి మసలుకోండి.. ఆరోగ్యంగా జీవించండి..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
