Homeఆదాబ్ ప్రత్యేకంDDU-GKY Scheme | తెలంగాణ డీడీయూ - జీకేవై స్కీమ్ లో భారీ స్కామ్..

DDU-GKY Scheme | తెలంగాణ డీడీయూ – జీకేవై స్కీమ్ లో భారీ స్కామ్..

  • ప్రాజెక్టుల కేటాయింపు, నిధుల విడుదలపై అనుమానాలు!
  • ఈజీఎంఎం అధికారుల పాత్రపై అనుమానాలు..
  • ప్రాజెక్టుల కేటాయింపు, ప్లేస్‌మెంట్లు, నిధుల విడుదలపై ప్రశ్నలు
  • సాహితి సిస్టమ్స్, వోక్సీ టెక్నాలజీస్ ప్రాజెక్టులపై విచారణకు డిమాండ్
  • రికార్డుల తనిఖీకి, స్వతంత్ర ఆడిట్‌కు వెల్లువెత్తున్న డిమాండ్స్..
  • ఈజీఎంఎం రాష్ట్ర మిషన్ మేనేజర్ జి. రామిరెడ్డిపై విచారణ జరగాలి

తెలంగాణలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమలవుతున్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం అమలులో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి..

తెలంగాణలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమలవుతున్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం(DDU-GKY Scheme) అమలులో పలు అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టు అమలు సంస్థల ఎంపిక, శిక్షణ లక్ష్యాల కేటాయింపు, ప్లేస్‌మెంట్ అర్హతలు, నిధుల విడుదల, ప్రాజెక్టుల ముగింపు ప్రక్రియల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

- Advertisement -

ఈ వ్యవహారంలో ఈజీఎంఎం రాష్ట్ర మిషన్ మేనేజర్ జి. రామిరెడ్డి, సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కె. శ్రీధర్, వోక్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మోతీలాల్ భార్గవ్, ఈజీఎంఎం మాజీ ఈడీ కృష్ణన్‌ల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు పరస్పర సంబంధాలతో వ్యవహరిస్తూ ప్రాజెక్టుల కేటాయింపులు, పరిపాలనా నిర్ణయాలు, నిధుల విడుదల ప్రక్రియలను ప్రభావితం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారిక రికార్డుల ఆధారంగా స్వతంత్ర విచారణ జరగాల్సి ఉంది.

వాట్సాప్ నంబర్ ద్వారా నగదు బదిలీల ఆరోపణలు :

ప్రాజెక్టు అమలు సంస్థలకు ఒక వాట్సాప్ నంబర్‌ను అందించి, ఆ నంబర్‌కు లక్షల రూపాయల మేర నగదు బదిలీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్‌షాట్లు ఉన్నాయని, వాటి ఆధారంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.. ఆ నంబర్ చెవిటి అజయ్ కుమార్‌కు చెందినదని, ఆయన ఈజీఎంఎం రాష్ట్ర మిషన్ మేనేజర్ జి. రామిరెడ్డి తరఫున మధ్యవర్తిగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అజయ్ కుమార్‌కు భరణి సెక్యూరిటీ సర్వీసెస్‌తో సంబంధం ఉండటంతో పాటు, న్యూ మిలీనియం యూత్ అసోసియేషన్ అనే సంస్థ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర ఉందని తెలుస్తోంది.. ఈ సంస్థల మధ్య ఉన్న సంబంధాలు, నిధుల లావాదేవీలు, ప్రాజెక్టుల కేటాయింపుల వెనుక ఉన్న వాస్తవాలను బ్యాంకు లావాదేవీలు, సంస్థల రికార్డులు, అధికారిక పత్రాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంది.

50 శాతం ప్లేస్‌మెంట్ నిబంధన అమలైందా..?

కొవిడ్‌కు ముందు అమలైన ప్రాజెక్టులకు సంబంధించిన తదుపరి దశ టార్గెట్ల కేటాయింపులో కనీసం 50 శాతం ధ్రువీకరించిన ప్లేస్‌మెంట్ సాధన తప్పనిసరి అనే నిబంధనను కొన్ని సంస్థల విషయంలో పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్దేశిత అర్హతలు సాధించని సంస్థలకు తదుపరి టార్గెట్స్ కేటాయించకుండా ఉండాల్సి ఉన్నప్పటికీ, మరికొన్ని సంస్థలకు కొత్త టార్గెట్లు మంజూరు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలు పాటించిన సంస్థలకు అడ్డంకులు సృష్టిస్తూ, మరికొన్ని సంస్థలకు టార్గెట్స్ కేటాయింపులు, గడువు పొడిగింపులు, నిధుల విడుదలలో ప్రాధాన్యం కల్పించారా..? అనే అంశాన్ని ప్రాజెక్టువారీగా పరిశీలించాలి. ఇందుకోసం ప్లేస్‌మెంట్ ధ్రువీకరణ పత్రాలు, టార్గెట్ కేటాయింపు ఉత్తర్వులు, తనిఖీ నివేదికలు, చెల్లింపుల వివరాలను పోల్చి చూడాల్సిన అవసరం ఉంది.

తనిఖీ నివేదికలతో ఒత్తిడి తెచ్చారా..?

కొన్ని ప్రాజెక్టు అమలు సంస్థలపై తనిఖీ నివేదికలు, ఆడిట్ అభ్యంతరాలు, నిబంధనల ఉల్లంఘనల పేరుతో ఒత్తిడి తెచ్చారని, మరికొన్ని సంస్థలకు మాత్రం లక్ష్యాల సవరణలు, నిధుల విడుదలలో వెసులుబాటు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలంగా వ్యవహరించని సంస్థల ప్రాజెక్టులను నిలిపివేయడం లేదా వాటి టార్గెట్లను తగ్గించడం ద్వారా ఇబ్బందులకు గురిచేశారనే అభియోగాలపైనా విచారణ జరగాల్సి ఉంది. ఈ అంశాలపై సంబంధిత అధికారుల వివరణలు, తనిఖీ రికార్డులు, నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించినప్పుడే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

డమ్మీ సంస్థలు.. కాగితాలపై శిక్షణ, ప్లేస్‌మెంట్లా?

కొన్ని ప్రాజెక్టు అమలు సంస్థలు క్షేత్రస్థాయిలో శిక్షణ నిర్వహించకుండానే అభ్యర్థుల నమోదు, హాజరు, ప్లేస్‌మెంట్ వివరాలను కాగితాలపై చూపించాయనే ఆరోపణలు ఉన్నాయి. శిక్షణ పొందని అభ్యర్థులను శిక్షణ పొందినవారిగా చూపించడం, ధ్రువీకరించని ప్లేస్‌మెంట్లను నమోదు చేయడం ద్వారా మైలురాళ్ల ఆధారంగా నిధులు పొందారనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ అంశంపై శిక్షణ కేంద్రాల భౌతిక తనిఖీలు, అభ్యర్థుల అసలు వివరాలు, బయోమెట్రిక్ హాజరు, శిక్షణ మూల్యాంకన రికార్డులు, ఉద్యోగ నియామక పత్రాలు, వేతన చెల్లింపుల ఆధారాలను పరిశీలించాలి. కేవలం పోర్టల్‌లో నమో దైన గణాంకాల ఆధారంగా కాకుండా, వాస్తవ ఉపాధి సాధనను స్వతంత్రంగా ధ్రువీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పీసీఓ తేదీల మార్పుల్లో పక్షపాతం జరిగిందా..?

ప్రాజెక్టు ప్రారంభ ఉత్తర్వులు, అభ్యర్థుల నమోదు గడువులు, శిక్షణ బ్యాచ్‌ల ప్రారంభ తేదీల విషయంలోనూ అసమానతలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంస్థలకు గడువు పొడిగింపులు కల్పించగా, మరికొన్ని సంస్థలకు అలాంటి అవకాశం ఇవ్వకుండా వాటి టార్గెట్లను సున్నాకు తగ్గించారనే అభియోగాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వోక్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు సంబంధించిన శిక్షణ బ్యాచ్‌ల తేదీలు, నమోదు వివరాలు, టార్గెట్ల సాధన రికార్డులను పరిశీలించాలి.

2025 ఆగస్టు తర్వాత వందలాది బ్యాచ్‌లు ప్రారంభించి అదే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసినట్లు పేర్కొన్న వివరాలు నిజమా? వాటికి గడువు పొడిగింపులు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఇతర సంస్థలకు ఎందుకు అదే అవకాశం కల్పించలేదు? అనే ప్రశ్నలకు అధికారిక రికార్డుల ఆధారంగా సమాధానాలు రావాల్సి ఉంది.

ఎస్సీ, ఎస్టీ లక్ష్యాల నమోదులోనూ అక్రమాల ఆరోపణలు :

ప్రాజెక్టుల ముగింపు ప్రక్రియలో సరైన ఫైల్ పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీలు లేకుండానే కొన్ని ప్రాజెక్టులను ముగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిర్దేశించిన టార్గెట్లు పూర్తికాకపోయినా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను రికార్డుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలుగా చూపించి టార్గెట్లను పూర్తి చేసినట్లు నమోదు చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే, అవి లబ్ధిదారుల ఎంపిక, అర్హత ప్రమాణాలు, ప్రభుత్వ నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు, పోర్టల్‌లోని నమోదు వివరాలు, ప్రాజెక్టు ముగింపు నివేదికలు, చెల్లింపుల అనుమతులను పరస్పరం సరిపోల్చి పరిశీలించాలి.

వోక్సీ టెక్నాలజీస్‌కు రూ.17.99 కోట్లకు పైగా చెల్లింపులా?

ఈ వ్యవహారంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం వోక్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాజెక్టు. ఈజీఎంఎం ప్రొసీడింగ్స్ నంబర్ Pతీశీc. చీశీ. 84/=ణ-జుGవీవీ/VOLఖSY/2019, కౌశల్ భారత్ పోర్టల్ వివరాలకు సంబంధించి, ఈ సంస్థకు 2,886 మంది అభ్యర్థుల శిక్షణ లక్ష్యం మంజూరైనట్లు, ఇప్పటివరకు కేవలం 119 మందికి మాత్రమే ప్లేస్‌మెంట్ కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.17.99 కోట్లకు పైగా ప్రజాధనం విడుదలైనట్లు పేర్కొనబడింది. అదనంగా 26.5శాతం మెయిల్ స్టోన్ చెల్లింపుగా రూ.43,58,780 విడుదలకు సంబంధించిన అంశం కూడా పరిశీలనకు రావాల్సి ఉంది.

ఈ చెల్లింపుల వివరాలు, ఆమోద ఉత్తర్వులు, వాస్తవ ప్లేస్‌మెంట్ గణాంకాలను అధికారిక రికార్డులతో ధ్రువీకరించాలి. 2,886 మంది లక్ష్యానికి గాను 119 మంది మాత్రమే ప్లేస్‌మెంట్లు సాధించినట్లు నమోదై ఉంటే, మిగిలిన అభ్యర్థుల శిక్షణ, ఉపాధి స్థితి ఏమిటి? నిధుల విడుదలకు వర్తించిన అర్హత ప్రమాణాలేమిటి? ప్లేస్‌మెంట్ లోపాలపై జరిమానాలు, నిధుల రికవరీ లేదా ప్రాజెక్టు రద్దు చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.

స్వతంత్ర విచారణకు డిమాండ్ :

డీడీయూ – జీకేవై పథకం(DDU-GKY Scheme) అమలులో పారదర్శకతను నిర్ధారించేందుకు ఉన్నతస్థాయి స్వతంత్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ ద్వారా జరిగినట్లు ఆరోపిస్తున్న ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తులు, సంస్థల మధ్య ఉన్న అనుబంధాలు, అర్హతలేని సంస్థలకు లక్ష్యాల కేటాయింపు, ప్లేస్‌మెంట్ వివరాల ఆధారంగా నిధుల విడుదల, ఎస్సీ – ఎస్టీ గణాంకాల నమోదులో జరిగినట్లు ఆరోపిస్తున్న మార్పులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి.

వివాదాస్పద చెల్లింపులపై ప్రాథమిక పరిశీలన పూర్తయ్యే వరకు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన తదుపరి చెల్లింపులపై తగిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత ప్రాజెక్టు ఫైళ్లు, ఆడిట్ నివేదికలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, పోర్టల్ రికార్డులను భద్రపరచాలి. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన, ఆర్థిక, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిధుల రికవరీకి చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ యువత భవిష్యత్తు, నైపుణ్య శిక్షణ పథకాల విశ్వసనీయత, ప్రజాధన వినియోగంలో పారదర్శకత దృష్ట్యా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

అయితే, ప్రస్తావించిన వ్యక్తులు లేదా సంస్థలపై వచ్చిన ఆరోపణలు స్వతంత్ర విచారణలో నిర్ధారణ అయ్యే వరకు వాటిని తుది వాస్తవాలుగా పరిగణించరాదు. సంబంధిత అధికారుల స్పందన, అధికారిక రికార్డుల పరిశీలన, నిష్పక్షపాత విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి రావాలి. మరిన్ని వివరాలు మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’‘..

- Advertisement -
RELATED ARTICLES

Latest News