- ఏజన్సీ రోడ్లపై నిరoతరం మృత్యుఘోష..
- ఇంకా ఎంతమంది ప్రాణాలు బలికావాలి?
- అధిక కూలీల ఆశ చూపి డ్రైవర్లతో పోటాపోటీగా లారీల పరుగులు?
- ఇసుక లారీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.. ప్రజల ప్రాణాలను కాపాడాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాల మహానాడు పొలిట్‌బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య
ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజన్సీ ఏరీియాలోనీ గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న అన్ని మoడలాల ప్రజలకు రాత్రి- పగలు నిత్యం వేళల్లో రహదారిలో ఇసుక లారీల మోతలు, హారన్ సైరన్ల మోతలు చెవులు చిలులు పడేలా, గుoడేలు అదిరేలా వినిపిస్తున్నాయి.. వాటి వెనుక అమాయకుల ప్రాణాల అరుపులు అధికారులకు, రాజకిీయ నాయకులకు వినిపించడం లేదా? ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులకు కనిపించడం లేదా? ఇంకా ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి? అని ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ఇసుక లారీల రాకపోకలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర మాల మహానాడు పొలిట్‌బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య (Chittimalla Sammaiah) శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఇసుక రవాణా పేరుతో రోడ్లపై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కూలీ ఆశతో డ్రైవర్ల మధ్య పోటీ!
రోజువారీ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ డ్రైవర్లను కొందరు లారీ యజమానులు అధిక మొత్తంలో కూలీ చెల్లిస్తామనే ఆశ చూపుతూ వేగంగా లారీలు నడిపేలా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని సమ్మయ్య (Chittimalla Sammaiah) పేర్కొన్నారు. రోజులో ఎక్కువ ట్రిప్పులు పూర్తి చేసిన వారికి అధిక కూలీ ఇస్తామనే విధానం ఉంటే, డ్రైవర్లపై ఒత్తిడి పెరిగి రోడ్డు ప్రమాదాల ముప్పు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేను ముందు.. నేను ముందు’ అన్నట్లుగా రోడ్లపై లారీలు పోటాపోటీగా దూసుకెళ్తే, చివరకు నష్టపోయేది ఎవరు? రోడ్డుపై ప్రయాణించే సామాన్య ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కాదా? ఉపాధి కోసం డ్రైవింగ్ చేస్తున్న కార్మికుల జీవితాలు కూడా ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడకూడదని ఆయన అన్నారు.
ఇసుక రవాణా ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా?
ఇసుక రవాణా ద్వారా ఆదాయం సమకూరడం ఒక అంశమైతే, ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన బాధ్యత అని సమ్మయ్య స్పష్టం చేశారు. లారీల రాకపోకల విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే ప్రమాదాలకు అవకాశం పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడకూడదని, ఇసుక లారీల వేగం, ట్రిప్పుల కోసం జరిగే పోటీ, డ్రైవర్లపై ఉండే ఒత్తిడి వంటి అంశాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలన జరపాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే లారీ యజమానులు, డ్రైవర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు ఇప్పటికైనా మేల్కొంటారా?
మంగపేట మండలంలో ఇసుక లారీల రాకపోకలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సమ్మయ్య కోరారు. రోడ్లపై అతివేగాన్ని నియంత్రించడంతో పాటు, వాహనాల పత్రాలు, డ్రైవర్ల అర్హతలు, ఓవర్‌లోడింగ్, రవాణా అనుమతులు తదితర అంశాలను తనిఖీ చేయాలని సూచించారు. ప్రజలకు ప్రమాదకరంగా మారే విధంగా లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు చేపట్టాలి. ప్రమాదకరంగా లారీలు నడిపే విధానానికి అడ్డుకట్ట వేయాలని, ఇసుక రవాణా వ్యవస్థను నిబంధనల ప్రకారం నిర్వహించేలా పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి!
ఇసుక లారీల రాకపోకలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ప్రజలకు భద్రత కల్పించాలని రాష్ట్ర మాల మహానాడు పొలిట్‌బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయాలని, అవసరమైన చోట వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. “ఇసుక లారీల వేగానికి బ్రేకులు వేయండి.. అమాయకుల ప్రాణాలను కాపాడండి. ప్రజల ప్రాణాల కంటే ఏ రవాణా వ్యాపారమూ ముఖ్యం కాదు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలి” అని చిట్టిమల్ల సమ్మయ్య (Chittimalla Sammaiah) ఈసందర్భంగా డిమాండ్ చేశారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
