- 500 చదరపు గజాల లోపు పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం..
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- 22ఎ పై శరవేగంగా ముఖ్యమంత్రి హామీలు అమలు..
- ఇప్పటివరకు ఏడు ఉత్తర్వులు జారీ..
- వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 16వ తేదీన 22ఎ సమస్యలను పరిష్కారిస్తామని రాష్ట్ర శాసనసభలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు.
ఇప్పటికే ఉన్నత స్ధాయి కమిటీ ఏర్పాటుతో కలుపుకుంటే ఆరు ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని తాజాగా జి.ఓ. ఎంఎస్. నెం.59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నెంబర్లు 14, 22, 29, 41 అనుగుణంగా మెమో నెంబర్. 48030ను జారీ చేశామని తెలిపారు.
దరఖాస్తుల పరిశీలనలో ఏమైనా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి రికార్డులు, లబ్దిదారుల అర్హత, క్రమబద్దీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో 59 జీవోను అనుసరించి కొన్ని అక్రమాలు జరిగాయని తమ దృష్టికి రావడంతో జీవో అమలును నిలిపివేయడం జరిగిందని అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించబడిన కన్వేయన్స్ డీడ్స్ ల జారీ అయిన కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలన్నారు.
శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
గతంలో జి.ఓ. 59 కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కారణాలతో వాటిని సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచారని దీంతో చిన్నచిన్న ఇళ్ల స్థలాలు, ఆస్తులకు సంబంధించిన సమస్యలతో సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద అంశాల విషయంలో సంబంధిత కోర్టులు ఇచ్చే ఆదేశాలకు లోబడి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
22-ఎ సమస్యలకు వరుస పరిష్కారాలు :
గత నెల 16వ తేదీన శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 22-ఎ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సహచర మంత్రులతో చర్చించి 22ఎ తో ముడిపడి ఉన్న 10 నుంచి 12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శాసనసభ లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత జి.ఓ 118, జి.ఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశాం.
22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ, డిటిసిపి, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వడం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారం , నాలా ప్రక్రియ పూర్తికాని పట్టాభూముల సమస్యకు పరిష్కారం, తాజాగా 59జీవో అమలు దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
