Homeఆదాబ్ ప్రత్యేకంSanskriti International School | సంస్కృతి స్కూల్‌కు తాళం!

Sanskriti International School | సంస్కృతి స్కూల్‌కు తాళం!

  • ‘ఆదాబ్ హైదరాబాద’ వరుస కథనాలకు కదిలిన విద్యాశాఖ
  • డీఈఓ ఆదేశాలతో కొండాపూర్‌లోని పాఠశాల మూసివేత.. ఎంఈఓ వెంకటయ్య ఆధ్వర్యంలో చర్యలు
  • అనుమతులు, భూ వివరాలు, అఫిడవిట్లపై ఇక సమగ్ర విచారణ ఎప్పుడు?
  • “స్కూల్‌కు తాళం వేశారు.. మరి ఇన్నేళ్ల వ్యవహారానికి బాధ్యులెవరు?”

కొండాపూర్ గోల్డెన్ టులిప్‌లో కొనసాగుతున్న సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌పై(Sanskriti International School) విద్యాశాఖ చర్యలకు దిగింది. ‘ఆదాబ్ హైదరాబాద’ వరుస కథనాల నేపథ్యంలో డిఈఓ ఆదేశాలతో సోమవారం ఎంఈఓ వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారులు పాఠశాలను మూసివేశారు. సుమారు 4 వేల గజాల విస్తీర్ణంలో కొనసాగుతున్న పాఠశాల నిర్వహణపై గత కొంతకాలంగా అనుమతులు, గుర్తింపులు, భూ వివరాలు, అఫిడవిట్లు, సీబీఎసఈ నిబంధనలకు సంబంధించి పలు ప్రశ్నలు వెలువడ్డాయి.

పాఠశాలను మూసివేయడం ప్రస్తుతానికి విద్యాశాఖ తీసుకున్న కీలక చర్యగా కనిపిస్తున్నప్పటికీ.. ఇన్నేళ్లుగా పాఠశాల ఏ అనుమతులతో కొనసాగింది? సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేశారా? నిబంధనల ఉల్లంఘనలు ఉంటే ఇంతకాలం ఎందుకు గుర్తించలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

- Advertisement -

వరుస కథనాలతో కదిలిన అధికారులు

సంస్కృతి స్కూల్(Sanskriti International School) నిర్వహణకు సంబంధించిన అనుమతులు, భూ వివరాలు,సీబీఎసఈ నిబంధనలు, అఫిడవిట్లపై ‘ఆదాబ్ హైదరాబాద’ గతంలో వరుస కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో ఫిర్యాదుదారు రణధీర్‌రెడ్డి డిఈఓ, ఎంఈఓ, సీబీఎసఈ తదితర అధికారులకు పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ అధికారులు పాఠశాలను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

విద్యా సంస్థా.. భారీ ఫీజుల వసూళ్ల కేంద్రామా?

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు భారీగా ఫీజులు చెల్లిస్తున్న నేపథ్యంలో.. పాఠశాల అనుమతులు, గుర్తింపులు, నిర్వహణపై ఏవైనా ఉల్లంఘనలు అధికారికంగా తేలితే అది కేవలం యాజమాన్యానికి సంబంధించిన అంశంగా చూడలేమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అంటున్నాయి.విద్యార్థుల నుంచి ఎన్ని సంవత్సరాల్లో ఎంత మొత్తంలో ఫీజులు వసూలు చేశారు? ఏ పేర్లతో ఫీజులు తీసుకున్నారు? రసీదులు ఎలా జారీ చేశారు? వసూలైన మొత్తాలకు సంబంధించిన లెక్కలేమిటి? అనే అంశాలపైనా అవసరమైతే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

పిల్లల భవిష్యత్తు ఎవరి బాధ్యత?

స్కూల్ మూసివేతతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేది విద్యార్థులేనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.విద్యార్థుల టిసిలు, విద్యా రికార్డులు, ఫీజులు, తదుపరి విద్యా కొనసాగింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారా?

సీబీఎసఈ లేదా విద్యాశాఖకు సమర్పించిన పత్రాల్లో వాస్తవాలకు విరుద్ధమైన సమాచారం ఉన్నట్లు అధికారిక విచారణలో తేలితే.. ఆ పత్రాలను ఎవరు సమర్పించారు? ఎవరు ధృవీకరించారు? వాటి ఆధారంగా అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనే అంశాలపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.నిబంధనల ఉల్లంఘన లేదా తప్పుడు సమాచారం సమర్పించినట్లు అధికారికంగా తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

విద్యాశాఖ ముందు ఇప్పుడు ప్రధానంగా

మూడు బాధ్యతలు ఉన్నాయి.

  1. విద్యార్థుల విద్యకు ఎలాంటి నష్టం కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
  2. పాఠశాల అనుమతులు, గుర్తింపులు, అఫిడవిట్లు, భూ వివరాలు, ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ జరపాలి.
  3. నిబంధనల ఉల్లంఘన లేదా తప్పుడు సమాచారం సమర్పించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

విద్య అనేది కేవలం వ్యాపార కార్యకలాపం కాదని, అది వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.పాఠశాల మూసివేతతో ఒక అధ్యాయం ముగిసినట్టేనా? లేక అనుమతులు, పత్రాలు, భూ వ్యవహారాలు, ఫీజుల వసూళ్లు, అధికారుల పర్యవేక్షణపై పూర్తిస్థాయి విచారణకు ఇది ఆరంభమా? అన్నది ఇప్పుడు విద్యాశాఖ తేల్చాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News