- 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి..
- నెట్ బ్యాంకింగ్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం..
ఆన్‌లైన్‌లో ఏదైనా కొనేటప్పుడు పేమెంట్ ఆప్షన్లు చాలానే కనిపిస్తాయి. యూపీఐ(UPI).. క్రెడిట్ కార్డు.. నెట్ బ్యాంకింగ్.. ఇలా ఏది ఎంచుకున్నా చెల్లింపు పూర్తవుతుంది. కానీ ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తోంది. యూపీఐపై ఎండీఆర్ అమల్లోకి వస్తే ఆ భారం మనపైనా పడుతుందా? మరి క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఎండీఆర్ ఉంటుందా? నెట్ బ్యాంకింగ్ పరిస్థితి ఏంటి? అసలు వినియోగదారుడి జేబు నుంచి అదనంగా డబ్బులు ఎప్పుడు వెళతాయి? ఇదే తెలుసుకోవాల్సిన విషయం.
అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన కొన్ని వ్యాపార యూపీఐ(UPI) చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి వస్తుంది. అయితే ఇది వ్యాపారి చెల్లించాల్సిన రుసుము. కస్టమర్ నుంచి వసూలు చేయకూడదు. ఉదాహరణకు మీరు దుకాణంలో రూ.10,000 విలువైన వస్తువు కొని యూపీఐతో చెల్లిస్తే.. మీ ఖాతా నుంచి రూ.10,000 మాత్రమే వెళుతుంది. మరో రూ.40 ఎండీఆర్ పేరుతో కట్ చేయరు. రూ.75,000 దాటిన లావాదేవీల్లోనూ ఎండీఆర్ గరిష్ఠంగా రూ.300కే పరిమితం. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలకు ఈ ఛార్జీ వర్తించదు.
క్రెడిట్ కార్డుతో చెల్లించినప్పుడు కూడా ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే అది కూడా వ్యాపారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10,000 విలువైన వస్తువు కొంటే.. కార్డు నుంచి సాధారణంగా రూ.10,000నే చెల్లిస్తారు. వ్యాపారి కార్డు చెల్లింపును స్వీకరించినందుకు ఎండీఆర్ చెల్లిస్తాడు. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని సేవలు లేదా ప్లాట్‌ఫామ్‌లు కార్డు చెల్లింపుపై ప్రత్యేక ఫీజు విధించవచ్చు. అంతేకాదు.. క్రెడిట్ కార్డు బిల్లును గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే వడ్డీ, ఆలస్య రుసుములు పడొచ్చు. అవి ఎండీఆర్ కాదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
