Homeరంగారెడ్డిEmployment | కళాకారుల ఉద్యోగాలపై కాలయాపన వద్దు

Employment | కళాకారుల ఉద్యోగాలపై కాలయాపన వద్దు

  • తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచి, రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల సమస్యలను ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కళాకారులకు ఉద్యోగాలు(Employment) కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామచందర్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవ్వాజి ప్రవీణ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జి బిర్రు యాక స్వామి, జవహర్‌నగర్ ఉప సర్పంచ్ రావులకోడు నరసింహులు గౌడ్‌తో పాటు పలువురు స్థానిక కవులు, కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా గజ్జల రామచందర్ మాట్లాడుతూ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల(Employment) కోసం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళాకారుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కమిటీ నాయకులతో వెంటనే చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే 33 జిల్లాల కళాకారులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పాటు చలో రవీంద్రభారతి కార్యక్రమం చేపట్టి ముట్టడిస్తామని హెచ్చరించారు.

బిర్రు యాక స్వామి మాట్లాడుతూ కాలయాపన వద్దు.. కళాకారుల ఉద్యోగాలు ముద్దు అనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోసి, గొంగడి ధరించి గ్రామగ్రామాన తిరుగుతూ పోరుపాటలతో ప్రజలను చైతన్యపరిచిన కళాకారులను ప్రభుత్వాలు విస్మరించడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో 550 మందికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ అర్హులైన పలువురు నిజమైన ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అనంతరం వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతో పాటు మేనిఫెస్టోలోనూ అంశాన్ని పొందుపరిచిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

జవ్వాజి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కళాకారులు, నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో వెయ్యి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కళాకారులను ఆదుకుంటామని చెప్పడం మినహా ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన చర్యలు ప్రకటించలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే కళాకారుల రాష్ట్ర కమిటీ నాయకులతో చర్చలు జరిపి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని జిల్లాల కళాకారులను కలుపుకొని ర్యాలీలు, ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడి పోరాటంలో పాల్గొన్న కళాకారుల జీవితాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని, ఇచ్చిన హామీలను అమలు చేసి వారికి న్యాయం చేయాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో కళాకారులు కొండూరి భాస్కర్, పిడమర్తి రాంబాబు, మేడే శ్రీనివాస్, నరుకుడు రాజు, సింగారపు శ్రీనివాస్, రవి గౌడ్, జాన్ బి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News