Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | టౌన్‌ప్లానింగ్‌ కాసుల కలకలం!

Corruption | టౌన్‌ప్లానింగ్‌ కాసుల కలకలం!

కాగితాలపై నిబంధనలు.. క్షేత్రస్థాయిలో వసూళ్ల పర్వం

  • మల్కాజిగిరి టౌన్‌ప్లానింగ్‌లో అక్రమాల జోరు..
  • రెండంతస్తుల అనుమతి.. ఐదంతస్తుల నిర్మాణం
  • ఫైర్ సేఫ్టీ లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు
  • సెట్‌బ్యాక్‌లు లేకుండా ప్రమాదకర నిర్మాణాలు
  • అంజయ్య నగర్ ఘటనతోనైనా మేల్కొనరా?
  • అక్రమ హాస్టళ్లపై తక్షణ చర్యలకు డిమాండ్

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం.ఎం.సి.) పరిధిలోని టౌన్‌ప్లానింగ్ విభాగం అక్రమాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ, కాసుల కక్కుర్తితో కొందరు అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మొన్నటికి మొన్న సరూర్‌నగర్ సర్కిల్-12 పరిధిలోని గడ్డి అన్నారం గ్రామం, గౌతమ్ నగరర్‌లోని సర్వే నంబర్ 248, ప్లాట్ నంబర్ 14లో వెలుగుచూసిన భారీ అక్రమ నిర్మాణమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ‘రెండంతస్తుల అనుమతి.. ఐదంతస్తుల అరాచకం’గా సాగిన ఈ వ్యవహారంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

అధికారికంగా కేవలం స్టిల్ట్ పార్కింగ్ ం రెండు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు తీసుకుని, క్షేత్రస్థాయిలో ఏకంగా ఐదు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించిన వైనం టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతికి పరాకాష్ట. మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా మూడు అదనపు అంతస్తులను అక్రమంగా నిర్మిస్తున్నా, పక్కనే ఉన్న అధికారులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులకు ఆశపడ్డారనే ఆరోపణలు బలపడుతు న్నాయి. కాగితాలపై నిబంధనల పాటకం, క్షేత్రస్థాయిలో వసూళ్ల పర్వం జోరుగా సాగుతుండటంతో నగరంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగులా అనధికారిక భవనాలు పుట్టుకొస్తున్నాయి.

గౌతమ్ నగరర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న ఈ భవనాలు సాధారణ నివాసాల కోసం కాకుండా, విద్యార్థులు, ఉద్యోగులు ఉండే హాస్టళ్ల కొరకు చేపట్టినట్లు తెలుస్తోంది. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే భారీ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, నిర్వాహకులు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అగ్నిప్రమాదాలు జరిగితే బయటకు వెళ్లేందుకు వీలుగా ఎలాంటి ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత) ఏర్పాట్లు చేయలేదు. అటు కనీస సెట్‌బ్యాక్‌లు (చుట్టూ ఖాళీ స్థలం) వదలకుండా అత్యంత ప్రమాదకరంగా ఈ బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు.

image 3

రేపు ఈ భవనాల్లో ఏ చిన్న అగ్నిప్రమాదం జరిగినా, గాలి-వెలుతురు సరిగా లేక, అత్యవసర మార్గాలు లేక వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసి పోయే పెను ప్రమాదం ముంచుకొస్తోంది. అమాయక యువత ప్రాణాలతో చెలగాటలాడుతున్న ఈ హాస్టళ్ల అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉదాసీనత తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.

సైబరాబాద్ పరిధిలోని అంజయ్య నగర్ సంఘటనే దీనికి హెచ్చరిక! : టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో జరిగే సంఘ టనలు ఎంతటి ప్రాణనష్టానికి దారితీస్తాయో చెప్పడానికి సైబరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో జరిగిన ఘోర భవన కూల్చివేత ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.

నిబంధనలకు విరుద్ధంగా, కనీస సెట్‌బ్యాక్‌లు పాటించకుండా అతి తక్కువ స్థలంలో చేపట్టిన అనధికారిక బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి పెను ప్రమాదాలకు కారణమవుతాయో అంజయ్య నగర్ దుర్ఘటన కళ్ళకు కట్టింది. అమాయక కార్మికుల ప్రాణాలను బలిగొనే ఇటువంటి అనర్థాలకు అధికారుల లంచగొండితనమే మూల కారణం. అయినప్పటికీ సరూర్‌నగర్ సర్కిల్‌లో అధికారులు కళ్ళుండి కూడా చూడనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అధికారుల మౌనం… అక్రమాలకు బలం! : బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలో భద్రతా ప్రమాణాలు గాలికి కొట్టుకుపోతున్నాయి. ఫిర్యాదుదారులు స్పష్టమైన ఆధారాలతో అధికారులను ఆశ్రయించినా, క్షేత్రస్థాయి పరిశీలనలు మొక్కుబడిగా ముగించి, ఫైళ్లను అటకెక్కించడం పరిపాటిగా మారింది. ఆమోదిత ప్లాన్‌ను బేరీజు వేయకుండా, కేవలం మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?

తీవ్రమైన విమర్శలు – తక్షణ చర్యలకు డిమాండ్ : ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన టౌన్‌ప్లానింగ్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో అంజయ్య నగర్ తరహాలో ప్రాణనష్టం జరగకముందే, అనధికారికంగా నిర్మిస్తున్న ఈ హాస్టల్ భవనాలను తక్షణమే సీజ్ చేసి, చట్టపరంగా కూల్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం నిద్రమత్తు వీడి, అక్రమార్కుల భరతం పట్టకపోతే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవక తప్పదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News