నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని గత సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కల్పించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. సంబంధిత వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, ఇకపై ఎలాంటి గొడవలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని కల్వకుర్తి ఎస్ ఐ కురుమూర్తి హెచ్చరించారు.
అనంతరం వారిని ఎంఆర్‌వో సమక్షంలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున బైండ్‌ఓవర్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.ఈ ఏడాది బోనాల ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఊరేగింపుల్లో డీజేలను వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అలాగే, అన్ని ఊరేగింపులను రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఊరేగింపుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా అందుకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఎస్‌ఐ కురుమూర్తి హెచ్చరించారు.
