- మాదారం.. రావిచేడు.. కడ్తాల్ భూముల విలువల్లో భారీ వ్యత్యాసం
- మార్కెట్ విలువ నిర్ణయంపై రైతుల అనుమానాలు
- ఫ్యూచర్ సిటీ ప్రభావంతో పెరిగిన భూముల ధరలు..
- పాత విలువలతో పరిహారం ఎలా?
- న్యాయమైన పరిహారం తేలే వరకు పనులు నిలిపివేయాలని ఆర్డీవోకు వినతి
బీదర్–మహేశ్వరం 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.విద్యుత్ లైన్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు అందాల్సిన పరిహారం విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కడ్తాల్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మాదారం,రావిచేడు,కడ్తాల్ ప్రాంతాలకు నిర్ణయించిన భూముల మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసం ఉందని,ఈ వ్యత్యాసం కారణంగా కడ్తాల్ రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.
మార్కెట్ విలువ ఎలా నిర్ణయించారు?
తేదీ 20-02-2025న కడ్తాల్,మాదారం,రావిచేడు ప్రాంతాలకు సంబంధించి పరిహారం నిర్ణయిస్తూ ఆర్డర్ జారీ చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు.అయితే ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో తమకు పూర్తి వివరాలు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగానా? గతంలో జరిగిన భూముల క్రయవిక్రయాలను పరిగణనలోకి తీసుకున్నారా? లేక ఇతర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమా? అనే విషయాలను అధికారులు స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు.మాదారం,రావిచేడు భూములకు పరిగణించిన మార్కెట్ విలువకు..
కడ్తాల్ భూములకు నిర్ణయించిన విలువకు ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో అధికారులు సమగ్రంగా వివరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఫ్యూచర్ సిటీ ప్రభావంతో పెరిగిన భూముల ధరలు కడ్తాల్ ప్రస్తుతం కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని,వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన మండల కేంద్రంగా రైతులు గుర్తుచేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ,హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భారీ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతో కడ్తాల్ చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరిగిందని వారు చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో భూముల ప్రస్తుత వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం నిర్ణయిస్తే రైతులు తమ విలువైన భూములను కోల్పోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఓడబ్ల్యూలోనే కాదు.. పక్క భూముల విలువకూ దెబ్బ!
హైటెన్షన్ లైన్ వెళ్లే ఆర్ఓడబ్ల్యూ కారిడార్ ప్రాంతంలోని భూములకే కాకుండా.. దాని పక్కనే ఉన్న భూములపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు.హైటెన్షన్ లైన్ కారణంగా భవిష్యత్‌లో ఆయా భూములను నివాస,వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే అవకాశాలు తగ్గుతాయని,దీంతో భూముల మార్కెట్ విలువ పడిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కడ్తాల్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్న సమయంలో హైటెన్షన్ లైన్ కారణంగా తమ భూముల విలువ తగ్గితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పట్టా భూములకు ప్రస్తుత విలువ ఆధారంగా పరిహారం ఇవ్వాలి
హైటెన్షన్ లైన్ కోసం భూములు,హక్కులు ప్రభావితమవుతున్న పట్టాదారులకు ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిహారం నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు.ప్రతి భూమి పరిస్థితి,భూమి వినియోగం,ప్రాంత అభివృద్ధి,ప్రస్తుత మార్కెట్ విలువ,భవిష్యత్‌లో భూమి కోల్పోయే ఆర్థిక ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే పరిహారం నిర్ణయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
న్యాయమైన రేటు తేలే వరకు పనులు ఆపాలి
కడ్తాల్ రైతులకు న్యాయం జరిగే వరకు గ్రామ పరిధిలో బీదర్–మహేశ్వరం 765 కేవీ హైటెన్షన్ లైన్ పనులను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు కందుకూరు ఆర్డీఓకు రైతులు వినతిపత్రం సమర్పించి మాదారం,రావిచేడు,కడ్తాల్ ప్రాంతాలకు నిర్ణయించిన మార్కెట్ విలువలు,పరిహారం నిర్ణయించిన విధానం తదితర వివరాలను తమకు అందించాలని కోరారు.అధికారులు రైతులతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని,భూముల ప్రస్తుత విలువపై పునఃసమీక్ష జరిపి కడ్తాల్ రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రైతుల భూములు అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్నా..
వారి భవిష్యత్తు నష్టపోయేలా నిర్ణయాలు ఉండకూడదని,మానవతా దృక్పథంతో వ్యవహరించి తమకు న్యాయం చేయాలని కడ్తాల్ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు గూడూరు పెంటారెడ్డి,గోరేటి జంగయ్య యాదవ్,మూడ గణేష్,కాంటేకార్ శ్రీనివాస్,గోరేటి శ్రీశైలం,పాండు యాదవ్,కేశవులు గౌడ్,వెంకట్ రాములు గౌడ్,మంకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
