- కీలక ప్రతిపాదన చేసిన గవర్నర్..
- విదేశీ ప్రభావాన్ని తగ్గించేందుకే ప్రయత్నం..
అమెరికాలోని టెక్సాస్‌లో హెచ్ – 1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకుని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ – 1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు. తరగతి గదుల నుంచి విదేశీ ప్రభావాన్ని తొలగించేందుకే ఈ చర్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్టిన్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన గ్రెగ్ అబాట్, ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. “టెక్సాస్ పబ్లిక్ స్కూళ్లలో H-1B వీసాలపై ఒక్క ఉద్యోగి కూడా ఉండకూడదు. ఇది ఇప్పటికే రాష్ట్ర ఏజెన్సీలు, యూనివర్సిటీలలో కొత్త H-1B పిటిషన్లను నిలిపివేస్తూ నేను జారీ చేసిన ఆదేశాలకు కొనసాగింపు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిషేధం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు, వీసా పునరుద్ధరణ కోరుకునే వారికి, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, విదేశీ సంస్థల నుంచి పాఠశాలలు నిధులు, ఆస్తులు స్వీకరించడం లేదా వారితో ఒప్పందాలు చేసుకోవడాన్ని కూడా నిషేధించాలని ప్రతిపాదించారు. “విదేశీ ప్రభావం ఏ రూపంలో ఉన్నా మన తరగతి గదుల్లో దానికి స్థానం లేదు” అని అబాట్ అన్నారు.
గత జనవరి 2026లో, అమెరికన్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతోందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, యూనివర్సిటీలలో కొత్త H-1B పిటిషన్లను అబాట్ నిలిపివేశారు. అయితే ఆ ఆదేశాలు పాఠశాలలకు వర్తించలేదు. ఇప్పుడు పాఠశాలలకూ ఈ నిబంధనలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. “హెచ్ – 1బీ వీసాలపై పరిమితులు విధించడంలో ఫెడరల్ ప్రభుత్వం విఫలమైంది. అందుకే టెక్సాస్ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. మన విద్యార్థులకు బోధించడానికి టెక్సాస్ వాసులను లేదా అమెరికన్లను మనం నియమించుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
