- 35 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం..
- అధికారులే ఆక్రమణదారులకు అండ..
- నకిలీ రికార్డులతో ప్రభుత్వ భూమి హాంఫట్
నైజాం కాలపు రాచరికపు దోపిడీని తలపిస్తూ, నేడు ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత గల అధికారులే స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న వైనం తీవ్ర కలవరపెట్టే విధంగా ఉంది. అప్పట్లో నైజాం సర్కారు ప్రజల సొమ్మును హరించిన తీరును తలపించేలా, బాధ్యతాయుత స్థానాల్లో ఉండాల్సిన కొందరు అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే, ఆక్రమణదారులకు అండగా నిలిచి ప్రజా ఆస్తులను దోచిపెట్టడం అత్యంత దారుణం, క్షమించరాని తప్పు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ గ్రామంలో వెలుగుచూసిన ఈ భారీ భూ కుంభకోణం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అప్పటి జిల్లా కలెక్టర్, అప్పటి మహేశ్వరం తహసిల్దార్ మహమూద్ అలీ, డిప్యూటీ తహసిల్దార్ నవత, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ వంటి అత్యున్నత బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారే స్వయంగా రంగంలోకి దిగి, నిబంధనలను నిలువునా ఉల్లంఘించి, నకిలీ రికార్డులను సృష్టించి ఏకంగా 35 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం అధికార దుర్వినియోగానికి అత్యున్నత స్థాయి.

ప్రజల చెమట సొమ్ముతో జీవిస్తూ ప్రజాద్రోహానికి పాల్పడిన ఈ అవినీతి అధికారుల సిగ్గులేకుండా ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే తలవంపులు తెస్తోంది. ప్రజా ఆస్తులను కొల్లలాడిన ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత మహేశ్వరం తహసిల్దార్ చేస్తున్న నిర్లక్ష్యాన్ని, జిల్లా అధికారుల పట్టించుకోని తనాన్ని పూర్తి ఆధారాలతో ‘ఆదాబ్ హైదరాబాద’ వెలుగులోకి తేనుంది..
