- జీఓ నెం 97 వెంటనే రద్దు చేయాలి
- పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం వద్దు
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి డిమాండ్
- ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు
- భారీగా మోహరించిన తుకారాం గేట్ పోలీసులు
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తు ఈస్ట్ మారేడ్ పల్లి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఐటీఐ, ఏటీసీలతో డిప్లమా కోర్సుల అనుసంధనం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా డిప్లమా కోర్సులను మరింత బలోపేతం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, జీవో నం. 97ను రద్దు చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలు పాలిటెక్నిక్ డిప్లమా వద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

డిప్లమా కోర్సులను ఐటీఐఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకత, ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకమైన సాంకేతిక విద్యా విధానమని, దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం ఇతర శిక్షణా విధానాలతో అనుసం ధానం చేయడం సరికాదని పేర్కొన్నారు. విద్యార్ధులకు ఉన్నత విద్య, ఇంజినీరింగ్ విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి, శిక్షణ పేరుతో సాంకేతిక విద్యా వ్యవస్థలో అనవసరమైన మార్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు.


పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక ప్రయోగశాలలు, పరికరాలు, గ్రంథాలయాలు, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థు లకు నాణ్యమైన బోధన అందించాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానం-2020 పేరుతో విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని కోరారు.
సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నవి ద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాలు, మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఇంజినీరింగ్ విద్యతో అనుసంధానం చేస్తూ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం. నైపుణ్య విశ్వవిద్యాలయం పేరుతో డిప్లమా విద్య స్థాయిని తగ్గించే విధానాలను తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోకుండా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులను పెద్ద సంఖ్యలో సమీకరించి మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమాల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్, ఆంజనేయులు, భారత్,చరణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
