Homeవరంగల్‌Illegal Sand Mining | ములుగు జిల్లా ఇసుక క్వారీల్లో యథేచ్ఛగా అక్రమతవ్వకాలు…

Illegal Sand Mining | ములుగు జిల్లా ఇసుక క్వారీల్లో యథేచ్ఛగా అక్రమతవ్వకాలు…

  • అడ్డదారిలో అదనపు వసూళ్లు
  • డీడీతో పనిలేదు.. ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సిందే
  • 3 ఆన్లైన్ బుకింగ్.. బిల్లులు చెల్లించినా అదనపు వసూళ్లు
  • లారీకి రూ.3 వేల నుంచి రూ.3,500.. డబ్బిస్తేనే లోడింగ్?
  • ఓవర్లోడ్, నకిలీ వేబిల్లులు.. రాత్రివేళల్లోనూ రవాణా?
  • టీజీఎండీసీకి ఫిర్యాదులు చేసినా స్పందన ఏది?
  • నిబంధనలు కాగితాలకేనా.. అధికారుల పర్యవేక్షణ ఏమైంది?

ములుగు జిల్లాలోని గోదావరి నది నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న క్వారీల నుంచి ఇసుకను అక్రమంగా తరలించకుండా, నిర్ణీత ధరకు ప్రజలకు అందించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ విధానానికి ములుగు,భద్రాద్రి జిల్లాల గోదావరి నది ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లు అడ్డదిడ్డoగా తూట్లు పొడుస్తున్నారా..?అన్న సందేహం సర్వత్రా కలుగుతోంది.

టి.జి.ఎం.డి.సి సైట్ ఆన్లైన్లో ఇసుక బుక్ చెసి, నిబంధనల ప్రకారం బిల్లులుచెల్లించిన లారీ యజమానుల నుంచి ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లు మళ్లీ అదనపు వసూళ్ల దందా కు యథేచ్ఛగా పాల్పడుతున్నా అధికార యంత్రాంగం ఎంతమాత్రం పట్టించుకోకుండా… ప్రత్యక్షంగా చోద్యం చూస్తూ మిన్నకుండి పోతున్నారు. ఓవర్లోడ్, నకిలీ వేబిల్లులు, రాత్రివేళల్లో రవాణా, నదీ గర్భంలో యథేచ్ఛగా తవ్వకాలు..ఇలా అనేక అక్రమాలు, అవినీతి ఇక్కడి ఇసుకర్యాంపుల్లో సర్వ సాధారణంగా వినిపించే కఠినమైన నిజాలు.అయితే ఇప్పుడు కఠోర వాస్తవాలను సైతం అధికార యంత్రాంగం, ప్రతినిధుల అండతో అవి అన్ని కూడా గిట్టని వారి ఆరోపణలు గా రైజింగ్ కాంట్రాక్టర్లు కొట్టివేస్తున్నారు.

- Advertisement -

అలాగే ఆయా గిరిజన సంఘాలు కూడా వారికే వత్తాసు పలుకుతూ వాస్తవాలను దాచిపెడుతూ సమాధానం దాటవేస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం,రమనక్కపేట, కత్తిగూడెం ఇసుకర్యాంపులోనూ వినిపిస్తున్నాయి. ఒక్కో లారీకి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలకు తోడు, ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోఒకటి ఇటీవల వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈవిషయంపై తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఆన్లైన్ బుకింగ్.. ఆపై అదనపు బాదుడు

రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన అనంతరం రవాణా చేయాలి. ఇసుక కొనుగోలుదారుడికి రవాణా కోసం రవాణా పాస్ లేదా వేబిల్ జారీ చేయాలి. వాహన సామర్థ్యానికి అనుగుణంగానే ఇసుక లోడింగ్ చేయాలి. ప్రభుత్వ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా వాడగూడెం,రమనక్కపేట,కత్తిగూడెం ఇసుక ర్యాంపులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని, బిల్లులు చెల్లించిన తర్వాత కూడా లారీ లోడింగ్ కోసం అదనంగా రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు చెల్లించాల్సి వస్తోందని లారీ అసోసియేషన్లు,ఓనర్లు,డ్రైవర్లు నెత్తి నోరు బాదుకుంటూ ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే లోడింగ్ ఆలస్యం చేస్తూ రోజుల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారని వాపోతున్నారు.

ఓవర్లోడ్ కు అడ్డెవరు?

ఇసుక ర్యాంపుల్లో అక్రమాలకు ప్రధాన కారణంగా మారుతున్న ఓవర్ లోడ్ ఆరోపణలు వాడగూడెం, రమనక్కపేట,కత్తిగూడెం ర్యాంప్ లోనూ వినిపిస్తున్నాయి. వాహన ఆర్సీలో ఉన్న అనుమతించిన సామర్థ్యం మేరకే లోడింగ్ చేయాల్సి ఉంటుంది. టీజీఎండీసీ కూడా వాహన పాసింగ్ సామర్థ్యానికి అనుగుణంగానే లోడింగ్ చేయాలని స్పష్టం చేస్తోంది. అయినా ఎక్కువ ఇసుకను తరలిస్తే ఎక్కువ లాభం వస్తుందన్న ఉద్దేశంతో సామర్థ్యానికి మించి లోడింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

దీనివల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలకు కూడా అవకాశం ఏర్పడుతోంది. వాడగూడెం,కత్తిగూడెం, రమనక్కపేట ర్యాంపు పరిధిలో నకిలీ వేబిల్లుల సాయంతో రాత్రివేళల్లో ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక రవాణాకు చెల్లుబాటు అయ్యేనిర్ధారణ చేయాలి. కొనుగోలుదారు నిర్ణీత ధర చెల్లించి రవాణా పాస్ పొందాలి.ఇసుక స్టాక్ యార్డ్ నుంచి వాహనం ఆమోదిత సామర్థ్యం మేరకే లోడింగ్ చేయాలి.

నిబంధనల అమలు ఎందుకు లేదు?

ప్రభుత్వమే ఇసుక ర్యాంపుల్లో అక్రమాలను అరికట్టడం, ఓవర్లోడింగ్ ను నియంత్రించడం, పారదర్శకత పెంచడం తమ విధాన లక్ష్యాలని ఓ వైపు చెబుతోంది. మరి వాడగూడెం,రమనక్కపేట,కత్తిగూడెం లో అదనపు వసూళ్లు, ఓవర్ లోడ్, నకిలీ వేబిల్లులు, అక్రమ రవాణా ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? ర్యాంపులో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎలా ఉంది? రోజువారీగా లోడింగ్, వేబిల్, లారీ వివరాలను ఎవరు తనిఖీ చేస్తున్నారు? ప్రభుత్వ ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకూడదనే నిబంధనకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎలాంటి విచారణ జరిగింది?

అసలు టీజీఎండీసీ అధికారులకు ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోవడం లేదు? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరిపి ర్యాంపు రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు, ఆన్లైన్ బుకింగ్ వివరాలు, వేబిల్లులు, వాహనాల బరువులను బహిర్గతం చేస్తేనే వాడగూడెం ర్యాంపులో జరుగుతున్నదేమిటో ప్రజలకు స్పష్టమవుతుంది. లేకపోతే నిబంధనలు కాగితాలకే పరిమితమై.. ర్యాంపులో మాత్రం ఇసుకతో పాటు అక్రమాలూ యథేచ్ఛగా ప్రవహిస్తున్నాయనే విమర్శలకు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News