- విమర్శలు గుప్పించిన కేటీఆర్..
- యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేశారు..
తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘యూత్ డిక్లరేషన్’ పేరిట కాంగ్రెస్ నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని విమర్శించారు. ఉద్యోగాలు రాక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని అన్నారు.
రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కనీసం 10 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి ‘‘ఎండ్రిన్ తాగి చావండి’’ అన్నట్లుగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ‘క్రిమినల్ వేస్ట్’ అని సీఎం రేవంత్ సంబోధించడం బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డేనని ఆరోపిస్తూ ‘‘అసలైన క్రిమినల్ వేస్ట్ ఆయనే’’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రాజ్యాంగ ప్రతితో తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన 24 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు.
