- ఆఫీస్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ సస్పెన్షన్..
- ఆదాబ్ హైదరాబాద్ కథనానికి స్పందన..
నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన నకిలీ స్పౌజ్ సర్టిఫికెట్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీస్ సూపరింటెండెంట్ డి. గోవింద్ నాయక్ (గోవిందు)పై ప్రభుత్వం ఎట్టకేలకు వేటు వేసింది. జూలై 6న ‘ఆదాబ్ హైదరాబాద్’ దినపత్రికలో ప్రచురితమైన సంచలన కథనం రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపగా, దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారుల చర్యలు – పూర్తి వివరాలు :
నకిలీ ధృవీకరణ పత్రాల సమర్పణ ఆరోపణలపై నల్గొండ జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ స్పందించి విచారణ చేపట్టారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనలు-1991, రూల్ 8 (1) ప్రకారం గోవింద్ నాయక్‌ను 30-07-2026 తేదీ నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ తీసుకున్న ఈ సస్పెన్షన్ చర్యను పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం అధికారికంగా ఆమోదించింది. పబ్లిక్ హెల్త్, ఎఫ్‌డబ్ల్యు డైరెక్టర్ డా. బి. రవీందర్ నాయక్ పేరుతో జూలై 31, 2026 న రాటిఫికేషన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, పూర్తి విచారణ జరిపి నివేదికను వెంటనే సమర్పించాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డైరెక్టర్ ఆదేశించారు.
వార్తా కథనం సారాంశం, నేపథ్యం :
ఒక ఏఎన్ఎం (కే. రమణి) బదిలీ ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్ సృష్టించారనే గట్టి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సర్టిఫికెట్‌పై ఉన్న సంతకం పూర్తిగా నకిలీదని, అప్పట్లో డీటీసీఓగా పనిచేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి స్పష్టం చేస్తూ ఆ పత్రంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తన భార్య పేరు ధరావత్ సునీత అయినప్పటికీ, రికార్డులను తప్పుదోవ పట్టించి మరొకరికి అనుకూలంగా ఈ అక్రమానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధులు వివరణ కోరినప్పటికీ ఆయన స్పందించకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
“షాడో డీఎంఅండ్‌హెచ్‌ఓ”గా చక్రం తిప్పుతున్న గోవింద్ నాయక్‌పై సమగ్ర విచారణ జరిపి, సర్వీస్ రిజిస్టర్లు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ రికార్డులను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ‘ఆదాబ్ హైదరాబాద్’ కథనాల ఆధారంగా ప్రభుత్వం స్పందించి గోవింద నాయక్ పై సస్పెన్షన్ వేటు వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
