- బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి..
- దోషులపై చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత
- గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్ఎస్ అధినేత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 2017లో చోటుచేసుకున్న ఘటన తెలంగాణ సమాజం తలదించుకునే విషాదకర సంఘటనగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. అప్పటి పాలక కుటుంబానికి చెందిన సభ్యురాలిగా ఆ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటూ ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.




ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవని ప్రభుత్వాల అవసరం ఏమిటని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటనలో బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. 2017లో ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్థులు లారీకి నిప్పంటించారని, అనంతరం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. ఆ ఘటనలో బాధితులైన కుటుంబాలకు నేటికీ పూర్తి న్యాయం జరగలేదని అన్నారు.
నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని కవిత తెలిపారు. అవసరమైతే ఎస్సీ కమిషన్ నివేదికను ప్రజల ముందుకు తీసుకువస్తామని, ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ ఎదుట ఆందోళనలు నిర్వహించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై మానవ హక్కుల కమిషన్ చర్యలు సూచించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ఒక అధికారిపై మాత్రమే చర్యలు తీసుకుని, మిగిలిన వారిని వదిలేశారని విమర్శించారు.




నేరెళ్ల బాధితుల సమస్యను ఎన్నికల సమయంలో ప్రస్తావించిన రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, వారి పిల్లల విద్యాభారాన్ని స్వీకరించాలని ఆమె కోరారు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడం సమాజం మొత్తం బాధ్యత అని, ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని కవిత పేర్కొన్నారు.
