Homeఆరోగ్యంWorld Hepatitis Day | ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం..

World Hepatitis Day | ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం..

( హెపటైటిస్‌… నిశ్శబ్దంగా కాలేయాన్ని తినేస్తోంది! )

  • దేశంలో కోట్లాది మందికి వ్యాధి ఉన్న విషయం తెలియదు
  • ఆలస్యంగా గుర్తిస్తే సిరోసిస్‌, లివర్ వైఫల్యం, లివర్ క్యాన్సర్ ముప్పు
  • ముందస్తు పరీక్షలు, హెపటైటిస్-బీ టీకా, సకాలంలో చికిత్సతో ప్రమాదాన్ని నివారించొచ్చంటున్న కేర్ వైద్యులు

ఎలాంటి లక్షణాలు లేకుండానే ఏళ్ల తరబడి కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే వైరల్ హెపటైటిస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. నివారించగలిగే వ్యాధి అయినప్పటికీ, చాలా మందికి తమకు హెపటైటిస్ ఉన్న విషయం కూడా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ ఏడాది “హెపటైటిస్: లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్” అనే అంశంతో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. హెపటైటిస్ నిర్ధారణ, టీకాలు, చికిత్స, సంరక్షణ అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని డబ్ల్యూహెచ్‌ఓ నొక్కిచెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 13 లక్షల మంది వైరల్ హెపటైటిస్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా.

భారత్ కూడా హెపటైటిస్ భారాన్ని అధికంగా మోస్తున్న దేశాల్లో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రజారోగ్య అంచనాల ప్రకారం దేశంలో సుమారు 2.9 కోట్ల మంది హెపటైటిస్-బీ, మరో 55 లక్షల మంది హెపటైటిస్-సీతో జీవిస్తున్నారు. అయితే వీరిలో చాలామందికి వ్యాధి ఉన్న విషయం తెలియదు. కారణం… ఈ వైరస్‌లు ఎలాంటి లక్షణాలు లేకుండానే సంవత్సరాల పాటు కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీయడం.

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ, అవగాహన లేకపోవడం, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వల్లే హెపటైటిస్ సంబంధిత కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌వీహెచ్‌సీపీ) ద్వారా మంచి పురోగతి కనిపిస్తున్నప్పటికీ, 2030 నాటికి హెపటైటిస్‌ను ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించాలంటే స్క్రీనింగ్‌, టీకాలు, ప్రజల్లో అవగాహన మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నప్పటికీ, లివర్ సిరోసిస్‌, లివర్ వైఫల్యం, లివర్ క్యాన్సర్‌కు ఇప్పటికీ హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కామెర్లు, పొట్టలో నీరు చేరడం, రక్త వాంతులు, కాలేయం పనితీరు దెబ్బతినడం లేదా లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చిన తర్వాతే చాలామంది ప్రత్యేక వైద్య కేంద్రాలకు వస్తుండటంతో చికిత్స క్లిష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు.

కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. రఘురామ్ కొండాల మాట్లాడుతూ, “హెపటైటిస్‌ను ‘సైలెంట్ డిసీజ్’ అని పిలవడానికి కారణం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వైరస్ సంవత్సరాల పాటు కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. సిరోసిస్‌, లివర్ వైఫల్యం లేదా లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాతే చాలామంది మా వద్దకు వస్తుంటారు. కాలేయ సమస్యలన్నీ ఫ్యాటీ లివర్ లేదా మద్యం వల్లే వస్తాయని చాలా మంది భావిస్తారు.

కానీ హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ కూడా ప్రధాన కారణాలే. మధుమేహం, ఊబకాయం, గతంలో రక్తం ఎక్కించుకున్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్నవారు, కుటుంబంలో కాలేయ వ్యాధుల చరిత్ర ఉన్నవారు, ఆరోగ్య సిబ్బంది, ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు లక్షణాలు లేకపోయినా హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలి” అని సూచించారు.

హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి కేసులు అధికంగా కనిపిస్తాయి. హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ మాత్రం కలుషిత రక్తం, సురక్షితం కాని ఇంజెక్షన్లు, శుభ్రత పాటించని వైద్య లేదా కాస్మెటిక్ విధానాలు, కలుషిత సూదులు పంచుకోవడం, రక్షణ లేని లైంగిక సంబంధాలు, తల్లి నుంచి శిశువుకు సంక్రమిస్తాయి. ఈ వైరస్‌లు ఏళ్ల తరబడి లక్షణాలు లేకుండానే శరీరంలో ఉండటంతో చాలామందికి వ్యాధి ఉన్న విషయం కూడా తెలియదని వైద్యులు తెలియజేస్తున్నారు.

తరచూ అలసటగా ఉండటం, నీరసం, ఆకలి లేకపోవడం, వాంతుల భావన, మూత్రం ముదురు రంగులో రావడం, కళ్లూ చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), కారణం లేకుండా బరువు తగ్గడం, పొట్ట ఉబ్బడం, తరచూ జీర్ణ సమస్యలు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచించారు. ప్రమాద కారకాలు ఉన్నవారు లక్షణాలు లేకపోయినా సాధారణ రక్తపరీక్షల ద్వారా హెపటైటిస్‌ను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.

కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ఆకాశ్ చౌధరి మాట్లాడుతూ, “హెపటైటిస్‌ను ముందుగానే గుర్తిస్తే భయపడాల్సిన అవసరం లేదు. హెపటైటిస్-బీని టీకాతో సమర్థంగా నివారించవచ్చు. హెపటైటిస్-సీని ఆధునిక యాంటీవైరల్ మందులతో చాలా మంది రోగుల్లో పూర్తిగా నయం చేయవచ్చు.

అయితే అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ చాలామందిలో ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ అవుతోంది. కాలేయం దెబ్బతినకముందే సాధారణ రక్తపరీక్షల ద్వారా వ్యాధిని గుర్తిస్తే సిరోసిస్‌, లివర్ క్యాన్సర్‌, లివర్ మార్పిడి అవసరమయ్యే పరిస్థితులను కూడా నివారించవచ్చు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ను సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగం చేయాలి” అని అన్నారు.

హెపటైటిస్-బీ టీకాను ప్రతి ఒక్కరూ తీసుకోవడం, ముఖ్యంగా పుట్టిన వెంటనే శిశువులకు తొలి డోసు ఇవ్వడం, గర్భిణులకు హెపటైటిస్ పరీక్షలు నిర్వహించడం, సురక్షిత ఇంజెక్షన్ విధానాలు పాటించడం, రక్తాన్ని తప్పనిసరిగా పరీక్షించిన తర్వాతే వినియోగించడం, ఆస్పత్రుల్లో సంక్రమణ నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం అత్యంత అవసరమని వైద్యులు తెలిపారు.

రేజర్లు, టూత్ బ్రష్‌లు, సూదులు ఇతరులతో పంచుకోవద్దని, టాటూలు, పియర్సింగ్‌లు శుభ్రమైన పరికరాలతోనే చేయించుకోవాలని, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ నుంచి కూడా రక్షణ పొందవచ్చని సూచించారు.

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా లక్షణాలు వచ్చే వరకు వేచి ఉండొద్దని, ప్రమాద కారకాలు ఉన్నవారు ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని కేర్ హాస్పిటల్స్ వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైరల్ హెపటైటిస్‌ను నివారించవచ్చని, చికిత్స చేయవచ్చని, అయితే ముందస్తు నిర్ధారణ ద్వారానే లివర్ వైఫల్యం, లివర్ క్యాన్సర్‌, అనవసర మరణాలను నివారించవచ్చని తెలిపారు. ప్రజల్లో అవగాహన, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారానే 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన లక్ష్యాన్ని భారత్ చేరుకోగలదని పేర్కొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News