Homeఆదాబ్ ప్రత్యేకంManair River | మానేరును మింగేస్తున్న ఇసుక మాఫియా..!

Manair River | మానేరును మింగేస్తున్న ఇసుక మాఫియా..!

  • అధికారుల అండతోనే అక్రమ తవ్వకాల దందా..?
  • నది గర్భంలోనే జేసీబీలు.. యథేచ్ఛగా లారీల్లో లోడింగ్
  • ఎన్ జి టి ఆదేశాలు, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నా మారని పరిస్థితి
  • ప్రభుత్వ ఖజానాకు ఆదాయం.. ప్రకృతికి మాత్రం శాశ్వత నష్టం..!

మానేరు నదిని ఇసుక మాఫియా అక్షరాలా మింగేస్తోందనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. చట్టాలు, నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానకొండూరు మండలం ఊటూరు ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల తీరు చూస్తే అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందా, లేక అక్రమాలకు మౌన మద్దతు ఇస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిబంధనలకు తూట్లు.. నది మధ్యలోనే దందా

ఇసుక తవ్వకాలు రెండు మీటర్ల లోతు దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, ఊటూరు రీచ్‌లో మాత్రం ఆ పరిమితులు పూర్తిగా బేఖాతరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీ జేసీబీలు, ఎక్స్కవేటర్లతో నది గర్భంలోనే లోతుగా తవ్వకాలు జరిపి, అక్కడికక్కడే లారీల్లో ఇసుకను నింపి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నదిని కాపాడాల్సిన వ్యవస్థే నదిని దోచుకునే వారికి అనుకూలంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

స్టాక్ యార్డులు కేవలం పేరుకేనా..?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీచ్ నుంచి ఇసుకను ముందుగా స్టాక్ యార్డుకు తరలించి, అక్కడి నుంచే విక్రయాలు జరగాలి. కానీ ఊటూరులో మాత్రం స్టాక్ యార్డుల వ్యవస్థను పూర్తిగా పక్కనబెట్టి, నది గర్భంలోనే నేరుగా లారీల్లో లోడింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇది నిబంధనల ఉల్లంఘన కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

టీజీఏండిసి అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారా..?

అక్రమాలను అరికట్టాల్సిన (టీజీఏండిసి) అధికారులు, గనుల శాఖ సిబ్బంది, సంబంధిత యంత్రాంగం ఎక్కడ ఉందని స్థానికులు నిలదీస్తున్నారు. రోజూ వందలాది లారీలు తిరుగుతున్నా, భారీ యంత్రాలు నదిలో పనిచేస్తున్నా అధికారులకు కనిపించడం లేదా? లేక కనిపించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మౌనం ఇసుక మాఫియాకు ధైర్యాన్ని ఇస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఎన్ జి టి ఆదేశాలు బుట్టదాఖలా..?

మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జి టి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం యథాతథ పరిస్థితులే కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థానాల ఆదేశాలకే విలువ లేకపోతే సాధారణ ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నిస్తున్నారు.

పర్యావరణంపై తీవ్ర ప్రభావం

అధిక లోతులో ఇసుక తవ్వకాల వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడం, నది ఒడ్లు కుంగిపోవడం, సమీప వ్యవసాయ భూములు దెబ్బతినడం, భవిష్యత్తులో వరదల ముప్పు పెరగడం వంటి తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిమంది లాభాల కోసం ప్రకృతిని శాశ్వతంగా నాశనం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందంతో ఊటూరు ఇసుక రీచ్‌లో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. డ్రోన్ సర్వే, లోతు కొలతలు చేపట్టి అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లు, బాధ్యులైన అధికారులు, అక్రమాలకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మానేరు నది పూర్తిగా ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News