Homeఆదాబ్ ప్రత్యేకంLand Scam | కొంగర ఖుర్ద్‌లో రూ. కోట్ల భూ కుంభకోణం..

Land Scam | కొంగర ఖుర్ద్‌లో రూ. కోట్ల భూ కుంభకోణం..

  • గైరాన్ భూమిని పట్టాగా మార్చిన అక్రమార్కులు..
  • ప్రభుత్వ భూమిని కాజేసిన భూ బకాసురులు..
  • నిమ్మకు నీరెత్తిన రెవెన్యూ అధికారులు..
  • చట్టంతో చెలగాటమాడిన అవినీతిపరులు..

“రక్షించాల్సిన రికార్డులే భక్షించాయి! రంగారెడ్డి జిల్లాలో మరో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ గడ్డి భూమి (గైరాన్) అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. సర్వే నంబర్లు 285 నుంచి 288 వరకు సాగిన ఈ అడ్డగోలు పట్టాల సృష్టి వెనుక ఉన్న ఆ ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి?”.. ఆదాబ్ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కొంగర ఖుర్ద్ గ్రామంలో వెలుగు చూసిన భూ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ ‘గైరాన’ (ప్రభుత్వ గడ్డి భూమి) గా రికార్డులకెక్కిన సర్వే నంబర్లు 285, 286, 287, 288 ఒక్కసారిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయనేది మిస్టరీగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న భూమిపై కన్నేసిన అక్రమార్కులు, అధికారుల అండతో అడ్డదారిలో పట్టాలు సృష్టించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

- Advertisement -

చట్టంతో చెలగాటం!

నిబంధనల ప్రకారం ఇవి రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22-ఏ కింద ‘నిషేధిత’ జాబితాలో ఉన్నాయి. అంటే, ఈ భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేదా హక్కుల బదిలీలు జరగకూడదు. కానీ, ‘భూ భారతి’ రికార్డులను మాయాజాలంతో తారుమారు చేసి, ప్రభుత్వ ఆస్తిని తమకు నచ్చిన వారికి కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేసిన చందంగా, అధికారుల పర్యవేక్షణ లోపమో లేక కుమ్మక్కో తెలియదు కానీ, ప్రభుత్వ భూమి పట్టా భూమిగా మారిపోయింది.

Kongara Khurd Government Land Scam

చక్రం తిప్పిన అబ్దుల్ ఖబీర్ :

ఈ మొత్తం వ్యవహారంలో మొహమ్మద్ అబ్దుల్ ఖబీర్ (ఖాతా సంఖ్య: 60374) అనే వ్యక్తి పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 38 మంది పట్టాదారులు ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నా, సదరు సర్వే నంబర్లలోని ఉప విభాగాల్లో ఖబీర్ పేరు పదేపదే కనిపిస్తుండటం, ఈ కుట్రలో ఆయనదే కీలక పాత్రని స్పష్టం చేస్తోంది.

గెజిట్‌లో విచిత్రం.. ప్రభుత్వ ఖజానాకు చిల్లు!

సర్వే నంబర్ 285ను ‘ప్రభుత్వ భూమి’గా గుర్తించిన అధికారులే, పక్కనే ఉన్న సర్వే నంబర్ 286ను రాత్రికి రాత్రే ‘పట్టా’ భూమిగా మార్చేశారు. భూ సేకరణ గెజిట్‌లో “ముహమ్మద్ అబ్దుల్ కబీర” పేరును పరిహారం గ్రహీతగా చేర్చడం వెనుక ఉన్నది రాజ్యాంగబద్ధమైన అధికారం కాదు, అక్రమ రాబందుల కుట్ర అని స్థానికులు మండిపడుతున్నారు.

సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూమికి
పట్టాదారులను సృష్టించిన ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి?

ప్రభుత్వ భూమికి పరిహారం చెల్లించి, ఖజానాకు గండి కొట్టిన అధికారులపై ఎందుకు చర్యలు లేవు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు స్పందించి, ఆ 38 మంది పట్టాదారుల నేపథ్యంపై సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమాలకు సహకరిం చిన అధికారుల ముసుగు తొలగించి, ప్రభుత్వ భూమిని కాపాడకపోతే వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది.

ఈ కుంభకోణంలో తెరవెనుక ఉన్న అధికారులు ఎవరు? ఎఫఐఆర్ నమోదైనా దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను పూర్తి ఆధారాలతో, తదుపరి కథనంలో ‘ఆదాబ్ హైదరాబాద’ వెలుగులోకి తీసుకురానుంది.

‘మా అక్షరం.. అవినీతిపై అస్త్రం!’.

- Advertisement -
RELATED ARTICLES

Latest News