Homeఆదాబ్ ప్రత్యేకంMaheshwaram | నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు..

Maheshwaram | నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు..

మహేశ్వరం, సిరిగిరిపురం గ్రామ పరిధిలో భారీ అక్రమ నిర్మాణాలు

  • ఎఫ్‌టీఎల్, భూదాన భూముల్లో విల్లాల నిర్మాణాలు..
  • కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న ప్రశ్న
  • సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పాత్రపై సమగ్ర విచారణకు డిమాండ్
  • భూదాన బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయన్న ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం పరిధిలో ప్రభుత్వ నిషేధిత భూముల క్రయవిక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో అక్రమ విల్లాలు, మరోవైపు భూదాన బోర్డుకు చెందిన భూములు కబ్జాకు గురవుతుంటే, అధికారులు చోద్యం చూడటం వెనుక భారీ కుట్ర దాగిఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Maheshwaram prohibited land registrations1

నిషేధాజ్ఞలున్నా ఆగని రిజిస్ట్రేషన్లు :

జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల (లెటర్ నంబర్: ఈ1/4231/2024, తేదీ: 28.10.2025) ద్వారా ఈ భూములను నిషేధిత (ప్రొహిబిటరీ) ఆస్తుల జాబితాలో చేర్చినప్పటికీ, అదే ఆస్తులపై రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సర్వే నెం. 6బి/పి లోని సుమారు 17 విల్లాల నిర్మాణాలు మరియు సర్వే నెం. 67, 68 లలోని దాదాపు 10 ఎకరాల భూదాన భూములకు సంబంధించి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ప్రశ్నార్థకమైన సబ్-రిజిస్ట్రార్ తీరు :

నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం సుమారు పదికి పైగా డాక్యుమెంట్లు (డాక్యుమెంట్ నంబర్లు: 21592/ 2025, 20981/2025, 18002/2025, 11739/2025, 11716/2025, 9626/2025, 2334/2025, 605/2025, 2183/2026, 1128/2026) నమోదు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చట్టబద్ధంగా ఎటువంటి మినహాయిం పులు లేని పక్షంలో, అధికారిక నిషేధ ఉత్తర్వులను ధిక్కరించి ఈ రిజిస్ట్రేషన్లను ఎవరు చేయించారో సమగ్ర విచారణ జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Maheshwaram prohibited land registrations10

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా? :

కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సబ్-రిజిస్ట్రార్, అక్రమార్కులకు సహకరిస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం చట్ట విరుద్ధమని నిపుణులు పేర్కొంటు న్నారు. ఎఫ్‌టీఎల్ మరియు భూదాన భూముల రికార్డులు స్పష్టంగా ఉన్నప్పటికీ, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహ రించడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తాలు’ ఎవరివో బయట పడాలని ప్రజలు కోరుతున్నారు.

నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములకు ఎలాంటి సమర్థించే అధికారిక ఆదేశాలు (సపోర్టింగ్ ఆర్డర్స్) లేకుండా రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణలో విఫలమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్లన్నింటినీ వెంటనే రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News