- నూతన గృహ ప్రవేశం..
- గైరుహాజరైన తండ్రి కమల్..
ప్రముఖ నటి శ్రుతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి ఆమె అడుగుపెట్టారు. నిన్న తన నూతన గృహంలో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రుతి హాసన్ చాలా నిరాడంబరంగా, సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తక్కువ ఆభరణాలు ధరించి పూజలో కూర్చున్న ఫొటోలతో పాటు ఈ సందర్భంగా సిద్ధం చేసిన పిండివంటలు, కొత్త ఇంటి తాళాలను కూడా ఆమె షేర్ చేశారు.
చెన్నైలో ఆమె కొత్త ప్రయాణం ప్రారంభించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
అయితే, ఈ ముఖ్యమైన కార్యక్రమానికి శ్రుతి తండ్రి, ప్రముఖ నటుడు కమల్ హాసన్, సోదరి అక్షర హాసన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడం గమనార్హం. కేవలం కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుకను నిరాడంబరంగా పూర్తి చేశారు. వారి గైర్హాజరుకు గల కారణాలపై హాసన్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి
