- ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్..
- అలిపిరి మార్గంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తం..
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో, భక్తుల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. యాత్రికుల ప్రశాంతతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
అలిపిరి కాలినడక మార్గంలోని దొరసాని మండపం వద్ద చిరుత సంచరించిన విషయాన్ని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన, భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, విజిలెన్స్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ‘హనుమాన్’ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. “భక్తులను నిరంతరం అప్రమత్తం చేయాలి. సున్నితమైన ప్రాంతాల్లో దట్టంగా పెరిగిన పొదలను తొలగించి, మార్గం స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలి. యాత్రికులు గుంపులు గుంపులుగా వెళ్లేలా అవగాహన కల్పించాలి. చిరుత సంచారం వార్తలతో భక్తులు ఆందోళనకు గురికాకుండా, వారికి భరోసా కల్పించేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు.
