- ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
- ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి
- జల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), జిల్లా పంచాయతీ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు రెండో దశలో ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా మంజూరు చేయాలని తెలిపారు. మండలాల వారీగా గృహాల నిర్మాణ పురోగతిని ఎంపీడీవోలతో సమీక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి, ఇళ్ల నిర్మాణం నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించి సేంద్రియ ఎరువుల తయారీతో పాటు ఇతర ఆదాయ వనరులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామాల్లో ప్రతిరోజూ పారిశుధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని, స్టీల్ బ్యాంకుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి వారం రెండు రోజుల పాటు డ్రై డే కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గతంలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడంతో పాటు క్లోరినేషన్ ప్రక్రియను నిరంతరం నిర్వహించాలని సూచించారు.
వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని, ఇందుకు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే ఫామ్ పాండ్ల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
