- నాయకత్వానికి మూలం… స్వయాన్ని చదివే సామర్థ్యం
- మీలో ఉన్న 5 అస్తిత్వ నాయకత్వ శైలులు (గాలి, భూమి, నీరు, అగ్ని, ఆకాశ తత్వం/స్వభావం ఆధారంగా)
- విద్యార్థులారా! మీలో దాగి ఉన్న నాయకుడిని గుర్తించారా?
ఇంతకు మునుపు వ్యాసం మొదటి భాగంలో గాలి నాయకత్వ శైలి గురించి వివరించాము.. నాయకత్వానికి మూలం.. స్వయాన్ని చదివే సామర్థ్యం “స్వయాన్ని తెలుసుకోండి -నాయకత్వాన్ని వెలికితీయండి”..
“నాయకులు పుడతారా? తయారవుతారా?” అనే ప్రశ్నను మనం తరచూ వింటుంటాం. కానీ నిజానికి ప్రతి మనిషిలో ఒక నాయకుడు దాగి ఉంటాడు. ఎందుకంటే ప్రకృతిలోని పంచభూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ఎలా ఈ విశ్వాన్ని నిర్మించాయో, అదే లక్షణాలు ప్రతి మనిషిలో కూడా కొంత మేర ఉన్నాయి.
అందుకే ప్రతి వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. అయితే మనలో చాలా మంది తమలో ఉన్న శక్తులను, గుణాలను, ప్రత్యేకతలను గుర్తించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలు “స్వయాన్ని చదవడం” , “స్వయాన్ని నడిపించడం” వంటి అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే.
నిజమైన నాయకత్వ ప్రయాణం
ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా?
స్వయాన్ని చదవడం ? స్వయాన్ని తెలుసుకోవడం ? స్వయాన్ని నడిపించడం ? ఇతరులను నడిపించడం అనే క్రమంలోనే.

గాలి నాయకత్వ శైలి :
మీలో ఉన్న గాలి తత్వం / స్వభావం నుంచి నాయకత్వ పాఠాలు :
కనిపించక పోయినా జీవితాన్ని నిలబెట్టే శక్తి… నిజమైన నాయకత్వానికి ప్రతీక! మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి అంశం మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. వాటిలో గాలి (వాయువు) అత్యంత ప్రత్యేకమైనది. గాలికి రంగు లేదు, వాసన లేదు, ఆకారం లేదు. అయినప్పటికీ ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి – మనుషులు, జంతువులు, పక్షులు, మొక్కలు – జీవించడానికి గాలిపైనే ఆధారపడుతున్నాయి.ఒక్క క్షణం గాలి లేకపోతే జీవితం నిలవదు. అయినప్పటికీ గాలి తన సేవకు ఎప్పుడూ గుర్తింపు, ప్రశంస లేదా ప్రతిఫలం ఆశించదు. అందరికీ సమానంగా సేవ చేస్తుంది. ఎలాంటి వివక్ష చూపదు. ఇదే గాలి మనకు నేర్పే గొప్ప నాయకత్వ పాఠం.
నిజమైన నాయకుడు గాలిలా ఉంటాడు!!
గాలి నాయకత్వ శైలికి చెందిన నాయకులు నిస్వార్థంగా పనిచేస్తారు. వారు తమ కర్తవ్యాన్ని నిశ్శబ్దంగా నిర్వర్తిస్తారు. పేరు, ప్రతిష్ఠ, ప్రచారం కోసం పరుగులు తీయరు. తమ పనుల ద్వారా సమాజానికి, సంస్థకు, కుటుంబానికి సేవ చేస్తారు.
వారి ప్రత్యేకత ఏమిటంటే :
- వారు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా పనిచేస్తారు.
- అందరికీ సమాన గౌరవం ఇస్తారు.
- కష్టసమయాల్లో ముందుండి బాధ్యతలు తీసుకుంటారు.
- సమస్యలను పెద్ద హడావిడి లేకుండా పరిష్కరిస్తారు.
- తమ విజయం కంటే సమష్టి విజయాన్నే ముఖ్యంగా భావిస్తారు.
ఇలాంటి నాయకులు వెలుగులో కనిపించకపోయినా, వారి ప్రభావం అందరి జీవితాలపై ఉంటుంది.
నిశ్శబ్ద సేవే వారి గుర్తింపు :
సమాజంలో కొందరు వ్యక్తులు ఎలాంటి ప్రచారం లేకుండా గొప్ప పనులు చేస్తుంటారు. పాఠశాలలో విద్యార్థులకు సహాయం చేసే ఉపాధ్యాయుడు, గ్రామాభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తి, ఇతరుల విజయానికి వెనుక నిలిచే నాయకుడు-ఇవన్నీ గాలి నాయకత్వానికి ఉదాహరణలు.వారి మంచితనం అనేక మందిని స్పృశిస్తుంది. కానీ చాలా మంది వారి కృషిని గమనించకపోవచ్చు. ఎందుకంటే వారు తమ సేవను ప్రదర్శించడానికి కాకుండా, ఫలితాలను సాధించడానికి ప్రాధాన్యం ఇస్తారు.
అవసరమైతే అద్భుత శక్తిని చూపగలరు
గాలి సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ తుఫానుగా మారినప్పుడు దాని శక్తి ఎంత గొప్పదో ప్రపంచం చూస్తుంది.
అలాగే గాలి నాయకత్వ శైలికి చెందిన వ్యక్తులు సాధారణంగా వినయంగా, నిశ్శబ్దంగా ఉంటారు. అయితే అవసరమైనప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తారు. అన్యాయం, అసత్యం లేదా సంక్షోభం ఎదురైనప్పుడు వారు అత్యంత శక్తివంతమైన నాయకులుగా మారగలరు.
విద్యార్థులకు సందేశం :
ఈరోజు సోషల్ మీడియా యుగంలో చాలా మంది గుర్తింపు కోసం, ప్రశంసల కోసం పనిచేస్తున్నారు. కానీ నిజమైన నాయకత్వం అనేది ఇతరుల ప్రశంసలలో కాదు, మన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడంలో ఉంటుంది.
- గాలిలా
- నిస్వార్థంగా సేవ చేయండి.
- అందరిని సమానంగా చూడండి.
- పనిని మాటల కంటే గొప్పదిగా భావించండి.
- కష్టసమయాల్లో బాధ్యత తీసుకోండి.
- గుర్తింపు కోసం కాదు, ప్రభావం కోసం పనిచేయండి.
గాలి మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది:
“నిజమైన నాయకులు ఎప్పుడూ వెలుగులో ఉండకపోవచ్చు. కానీ వారి సేవ, వారి విలువలు, వారి ప్రభావం అనేక జీవితాలను వెలిగిస్తాయి.” ప్రపంచానికి ఈరోజు అత్యంత అవసరమైన నాయకులు గాలిలాంటి నాయకులే-నిస్వార్థంగా, నిశ్శబ్దంగా, వివక్ష లేకుండా అందరి శ్రేయస్సు కోసం పనిచేసే నాయకులు. “గాలిలా కనిపించకపోయినా… జీవితాలను మార్చే నాయకుడిగా ఎదగండి!”
గాలి కనిపించదు. దానికి రంగు లేదు, ఆకారం లేదు. కానీ జీవం నిలబడటానికి గాలి అత్యంత అవసరం. ఈ నాయకులు కూడా అలానే ఉంటారు.
- నిశ్శబ్దంగా పనిచేస్తారు.
- పేరు, ప్రతిష్ఠల కోసం పరుగెత్తరు.
- అందరికీ సమానంగా సహాయం చేస్తారు.
- సమస్యలను పెద్ద హడావిడి లేకుండా పరిష్కరిస్తారు.
వీరి సేవలు అందరికీ ఉపయోగపడతాయి. కానీ చాలాసార్లు వీరిని ప్రజలు గుర్తించలేరు. అయితే అవసరమైన సమయంలో వీరి ప్రభావం ఎంత గొప్పదో అందరికీ తెలుస్తుంది. ఇలాంటి నాయకులు అరుదుగా కనిపిస్తారు కానీ సమాజానికి అమూల్యమైనవారు.
“స్వయాన్ని తెలుసుకో… నాయకత్వాన్ని వెలికితీయి; సమాజాన్ని ప్రగతి, సామరస్యం మరియు శ్రేయస్సు వైపు నడిపించు!”
ఓ విద్యార్థీ! నీవు సామర్థ్యంలో అనంతుడివి, అవకాశాల్లో అపరిమితుడివి!

(కోటికి పైగా విద్యార్థుల్లో పఠన చైతన్యాన్ని వెలిగించిన హైదరాబాద్కు చెందిన సంస్థ)
www.readindia.info
