Saturday, July 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంScam | సిరిగిరిపురంలో భూ కుంభకోణం..

Scam | సిరిగిరిపురంలో భూ కుంభకోణం..

భూదాన్ భూమిలో అక్రమ లేఅవుట్లు

  • కొత్తకుంట చెరువును మింగేస్తున్న రియల్ మాఫియా
  • మ్యుటేషన్ల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు అక్రమాలు
  • 22`ఏ నిషేధిత భూమిలో రిజిస్ట్రేషన్లు ఎలా..?
  • హైకోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తున్న మాఫియా!
  • రెవెన్యూ, హెచఎండిఏ శాఖల పాత్రపై ప్రశ్నలు
  • షోకాజ్ నోటీసులిచ్చి 18 నెలలైన చర్యలు శూన్యం
  • ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రజల డిమాండ్

భూదాన్ యజ్ఞ బోర్డు ప్రకారం, ఈ భూమిని విక్రయించడం కానీ, మ్యుటేషన్ చేయడం కానీ చట్టరీత్యా నేరం.

- Advertisement -

చెరువు మాయం.. భూదాన్ భూమి ప్రైవేటీకరణ.. నిషేధిత భూమిలోనూ రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ ఒకే గ్రామంలో జరుగుతున్నాయన్న ఆరోపణలతో సిరిగిరిపురం భూ వ్యవహారం సంచలనంగా మారింది. అధికారుల మౌనం, కొనసాగుతున్న నిర్మాణాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, సిరిగిరిపురం గ్రామం భూ మాఫియాకు అడ్డాగా మారిందా.. అంటే, అక్కడి పరిస్థితులు చూస్తుంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోంది. సర్వే నంబర్ 68లో జరుగుతున్న అక్రమ లేఅవుట్లు, విల్లా నిర్మాణాల తీరు చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఉందా? లేక రియల్ ఎస్టేట్ మాఫియా జేబులో ఉందా? అన్న అనుమానాలు సామాన్యులను వెంటాడుతున్నాయి.

సిరిగిరిపురంలోని కొత్తకుంట చెరువు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో జూన్ 24వ తేదిన అధికారుల మౌనం.. అక్రమార్కులకు వరం అనే శీర్షికన ప్రచురితమైన కథనంతో వెంటనే స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులు రద్దు చేయాలంటూ హెచఎండిఏ అధికారులను, అడిషనల్ కలెక్టర్ కుంట కబ్జాను నిర్దారిస్తూ తదుపరి చర్యలకై స్పష్టమైన నివేదికను అందజేసింది.

కాగా, హెచఎండిఏ శాఖ 2025 జనవరిలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసినా, అక్రమార్కులకు ఏమాత్రం భయం లేదంటే వారి వెనుక ఉన్న ‘శక్తులు’ ఎంతటివారో అర్థం చేసుకోవచ్చు. కోర్టు ‘స్టేటస్ కో’ ఆదేశాలు ఉన్నప్పటికీ, నిషేదిత జాబితాలో ఉన్నప్పటికీ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగడం న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి అగౌరవం కాదా..?

సర్వే నంబర్ 68లో ఏకంగా 16 ఎకరాల 34 గుంటల భూమి ‘భూదాన’ భూమిగా రికార్డుల్లో ఉంది. భూదాన్ యజ్ఞ బోర్డు ప్రకారం, ఈ భూమిని విక్రయించడం కానీ, మ్యుటేషన్ చేయడం కానీ చట్టరీత్యా నేరం. అయినా, అక్కడ విల్లా ప్లాట్ల విక్రయాలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు.. ఈ అక్రమాలకు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

22 ఏలో ఉన్నా ఆగని రిజిస్ట్రేషన్ల దందా!

2025 అక్టోబర్ 28న ప్రభుత్వం ఈ భూమిని సెక్షన్ 22`ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. అంటే, ఈ భూమిపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకూడదు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి.. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పాత్ర ఏమిటి.. అనే దానిపై సమగ్ర విచారణ జరగాల్సిందే.

సమగ్ర విచారణే ఏకైక పరిష్కారం!

ఇరిగేషన్, హెచ్.ఎమ్.డి.ఎ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్.. ఇలా ప్రతి శాఖలోనూ అక్రమాలు జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు కేవలం షోకాజ్ నోటీసులకే పరిమితమై, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ‘అక్రమార్కులకు అధికారుల అండ’ ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.

  • హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలు సాగించడంపై చర్యలు ఏవి?
  • భూదాన్ భూమిపై జరిగిన మ్యుటేషన్లు, ధరణి నమోదులను రద్దు చేసే ధైర్యం కలెక్టర్లకు ఉందా?
  • క్షేత్రస్థాయిలో చెరువు కబ్జాకు గురైందని ఇరిగేషన్ శాఖ స్పష్టమైన నివేదిక ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.. అక్రమంగా నిర్మించిన విల్లాలను ఎందుకు కూల్చడం లేదు..

ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. కేవలం ఒక శాఖకు కాకుండా, అన్ని శాఖల సమన్వయంతో ఉన్నతస్థాయి విచారణ చేపట్టి, ఈ భూ కుంభకోణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల జేబులు నింప డం కోసం ప్రజా ఆస్తిని, చెరువులను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు.

“మా అక్షరం.. అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News