- పేరుకే ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్.. !
- ఈ యూనిట్ నిర్వీర్యంతో కుంగిపోతున్న వినియోగదారుడి హక్కులు..
- అసలు ఎవరు లాభపడుతున్నారు?
- వినియోగదారుడి హక్కులు కాపాడటం ప్రభుత్వ ధర్మం కాదా ?
- ఇది హెచ్చరిక మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య బాధ్యత గుర్తుచేసే ప్రశ్న..
‘వినియోగదారుడు దేవుడితో సమానం.. అతని ప్రయోజనాలే దేశానికి రక్ష “ అని మహాత్మాగాంధీ సెలవిచ్చారు.. కానీ వినియోగదారుడి ప్రయోజనాలు పక్కనబెడితే.. అసలు పరిరక్షణ కూడా జరగడం లేదన్నది వాస్తవం.. లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ తన గురుతర బాధ్యతలను పక్కనపెట్టేసింది.. ఒక చిన్న వస్తువు కొన్నా దానికి ట్యాక్స్ చెల్లిస్తారు.. చెల్లించే ట్యాక్స్ కు సరైన న్యాయం జరుగపోతే ఎవరిని ప్రశ్నించాలి..? కాయా కష్టం చేసి అవసరానికి కొనుగోళ్లు చేద్దామంటే తూకంలో పెద్ద తేడా జరుగుతోంది..
ఒకప్పుడు గుప్పెడు నోట్లు తీసుకువెళ్తే గంపెడు సరుకులు వచ్చేవి.. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపొయింది.. గంపెడు నోట్లు తీసుకుని వెళ్తే గుప్పెడు సరుకు కూడా రావట్లేదు.. ఇక నాణ్యత విషయం వినియోగదారుడు ఎప్పుడో మరిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.. ఓట్లు వేస్తాం.. నాయకులను ఎన్నుకుంటాం.. ఆ నాయకులు సజావుగా పరిపాలిస్తాడు.. సంతోషంగా జీవనం సాగించవచ్చు అని భావిస్తాం.. కానీ ప్రస్తుత సమాజంలో కొంతమంది నాయకులు కల్తీ అయిపోయారు..
ఆ నాయకులను చూసి ప్రభుత్వ అధికారులు సైతం కల్తీ అయిపోయారు.. నెలకు వేలల్లో జీతాలు తీసుకుంటూ.. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ అమాయకులైన వినియోగదారుల నడ్డి విరిచేస్తున్నారు.. అక్రమార్జనకు అలవాటుపడి, వ్యవస్థలను నీరుగారుస్తున్నారు.. అత్యంత కీలకమైన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయి.. సామాన్యుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది.. తూనికలు, కొలతల శాఖలో పేరుకుపోయిన అవినీతిపై ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘ అక్షర పోరాటం..
రాష్ట్రంలో ప్రతి చోటా మోసం, కల్తీ, తూకంలో తేడాలు రాజ్యమేలుతున్నాయి..
- పెట్రోల్ మోసం : 1 లీటర్ పోయించుకుంటే 2 పాయింట్లు (20ఎం ఎల్) తక్కువ వస్తుంది. రూ.1000కు రూ.20 నష్టం! రోజూ 500 మందికి.. కోట్లలో మోసం.
- బియ్యం తూకంలో మోసం : 50 కేజీల బియ్యం బస్తాలో 1 కేజీ తక్కువ అంటే 49 కేజీలు మాత్రమే..
- బంగారం – వెండి మోసం : బిల్లులో హాల్మార్క్ వివరాలు ఉండవు. తక్కువ క్యారెట్ బంగారం, తప్పుడు తూకాలు. 1 గ్రాము తేడా.. వేల రూపాయల నష్టం!
- గ్యాస్ సిలిండర్ : 14.2 కేజీల్లో 200-300గ్రా తక్కువ. నెలకు 2-3 సిలిండర్లు — రూ.100 ప్లస్ మోసం!
- సూపర్ మార్కెట్ ప్యాకెట్లు : ఎం.ఆర్.పీ. కన్నా ఎక్కువ ధర, తక్కువ పరిమాణం. రూ.10-50 అదనపు చెల్లింపు!
(సబ్బులు, డెటర్జెంట్లు)
కిలో బియ్యం కొన్నా ,పెట్రోల్ పోయించుకున్నా సూపర్ మార్కెట్ లో వస్తువులు కొంటున్నా, గ్యాస్ సిలెండర్ తీసుకున్నా , ఇలా రోజు వారి కొనుగోళ్ళకు ఈ లావాదేవీలన్నీ “నమ్మకం” మీద ఆధారపడి ఉంటాయి.. ఆ నమ్మకానికి చట్టపరమైన భరోసా ఇవ్వాల్సింది లీగల్ మెట్రాలజీ శాఖ కానీ నేడు ఈ శాఖ అంతర్గత లోపాలతో, తప్పుడు తడకల ప్రమోషన్లతో కొట్టుమిట్టాడుతూ వినియోగదారుల హక్కులను, నమ్మకాన్ని గాలికి ఒదిలి కళ్ళు తెరుచుకుని మరీ నిద్రపోతుందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి..
రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లీగల్ మెట్రాలజీ శాఖలో అత్యంత కీలకమైన విభాగంగా భావించే ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్ పనితీరుపై ప్రస్తుతం అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొలతలు, తూకాలు, ప్యాకేజింగ్ ప్రమాణాలు, వ్యాపార మోసాల నియంత్రణలో ఫ్లయింగ్ స్క్వాడ్ పాత్ర అత్యంత కీలకం. అలాంటి విభాగం ఏడు సంవత్సరాలుగా స్తబ్దుగా ఉందనే ఆరోపణలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

లీగల్ మెట్రాలజీ శాఖలో ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర సిబ్బందితో కూడిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్ ఉందా? ఉంటే, ఆ యూనిట్ గత ఏడు సంవత్సరాలుగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదనే సమాచారం ఎంతవరకు నిజం? అనే ప్రశ్నలు ఇప్పుడు శాఖ ఉన్నతాధికారుల ముందున్నాయి.
ఎవరి బాధ్యత?
ఒక రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తనిఖీలు నిర్వహించగల అధికారంతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్ నిర్వీర్యంగా మారితే, అది కేవలం ఒక పరిపాలనా లోపం కాదు.. అది వినియోగదారుల హక్కులపై ప్రత్యక్ష ప్రభావం చూపే వ్యవస్థాపరమైన వైఫల్యం. విభాగాధిపతి అయిన కంట్రోలర్ ఈ యూనిట్ పనితీరుపై సమీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు? ఇతర అసిస్టెంట్ కంట్రోలర్ల పనితీరును సమీక్షిస్తూ, ఫ్లయింగ్ స్క్వాడ్ పనితీరును పక్కన పెట్టడం వెనుక కారణమేంటి?
ఉన్నతాధికారి బాధ్యత ఎక్కడ?
ఎస్. ఉమారాణి అసిస్టెంట్ కంట్రోలర్, ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్ గా పదోన్నతి పొందినట్లయితే, ఆ పదవికి సంబం ధించిన బాధ్యతలు నిర్వర్తించకపోవడానికి ఏమైనా సముచిత కారణాలున్నాయా? ఈ శాఖ అప్రమత్తంగా పనిచేస్తే వ్యాపారి మోసం చేయడానికి భయపడతాడు, వినియో దాదారుడు నిశ్చింతగా వస్తువుల కొనుగోళ్లు జరుపుతారు, కానీ అదే శాఖలోని అత్యంత కీలకమైన ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్ సంవత్సరాల తరబడి నిర్వీర్యంగా ఉంటే ఏమనుకోవాలి..? ఈ వ్యవహారాలపై వరస కథనాలతో మీముందుకు తీసుకుని రానుంది
‘ఆదాబ్ హైదరాబాద’.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం’..
(మిగతాది వచ్చే కథనంలో..)
